కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళిని తాకి ఇవ్వమని ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు ఇచ్చారు. ఆ తాళిని అందుకున్న ఎమ్మెల్యే... సీతమ్మ మెడలో (విగ్రహం) కట్టేశాడు. తాళి కడుతున్న సమయంలో ఎమ్మెల్యేన పండితులు అడ్డుకోకుండా అక్షింతలు వేయడం గమనార్హం.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో తాను చేసిన తప్పును తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలతో పాటు భక్తులకు క్షమాపణలు చెప్పారు. పైగా, పండితులు కట్టమంటేనే తాను సీతమ్మ మెడలో తాళికట్టానని బుకాయిస్తున్నారు. దేవుళ్లపై తనకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని, గత 15 యేళ్లుగా క్రమం తప్పకుండా అయ్యప్ప మాల వేస్తున్నట్టు సెలవిచ్చారు. అయితే, నెటిజన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఏం చేస్తే ఏమి లాభమని, కనీస జ్ఞానం లేకుండా నడుచుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.