కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. తను చేయాల్సిన రాజకీయ వ్యూహం తాను చేసుకుపోతోంది. బద్వేలులో తాము పోటీకి దిగం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. మరో పక్క జన సేన కూడా టీడీపీ బాటలో, తాము కూడా అభ్యర్థిని నిలబెట్టడం లేదని ప్రకటించింది. అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ పోటీకి దూరం అయినా, వైసీపీ మాత్రం తన ముందు జాగ్రత్తలో తాను ఉంటోంది. ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లతో పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ సమావేశం అయ్యారు. దీనికి హాజరైన పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణ రెడ్డి, డెప్యూటీ సీఎం అంజాద్ బాషా, నారాయణ స్వామి, ఎన్నికల ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అదిమూలం సురేష్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు వైసీపీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.