టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను నోటికొచ్చినట్టు తిడితే చాలు.. వచ్చే ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయిస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం అక్షరాలా నిజం. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని.. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మరుసటి రోజు మీడియా సమావేశంలో చంద్రబాబు, నారా లోకేశ్‌లను తిట్టిపోశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంటే.. విజయవాడ లోక్‌సభ వైకాపా అభ్యర్థిగా కేశినేని నానికి టిక్కెట్‌ను కేటాయించారు.
మరోవైపు, వైకాపా అధినాయకత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల సమన్వయకర్తలను మార్చుతుంది. ఇప్పటికే ఇన్‌చార్జిల మార్పుపై రెండు జాబితాలు విడుదల చేసిన వైసీపీ... నేడు మూడో జాబితా విడుదల చేసింది. గురువారం సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. కేశినేని నాని టీడీపీకి అధికారికంగా రాజీనామా చేసినట్టు ఇంకా నిర్ధారణ కాలేదు... పైగా ఆయన వైసీపీ కండువా కూడా కప్పుపుకోలేదు... అయినప్పటికీ వైసీపీ ఆయనను విజయవాడ ఇన్‌చార్జిగా ప్రకటించడం విశేషం.
అలాగే, మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ అర్థాంగి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంటు ఇన్‌చార్జిగా ప్రకటించారు. విశాఖ స్థానం నుంచి బొత్స కుటుంబంలో ఒకరికి చాన్స్ ఇస్తారని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. గురువారం వెల్లడైన మూడో జాబితా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రచారమే నిజమైంది.
ఇక, తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి మరోసారి లోక్‌సభ అవకాశం లేనట్టేనని చెప్పాలి. తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌చార్జిగా కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌ను నియమించారు. సునీల్ కుమార్ యాదవ్ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తనయుడు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పేరాడ తిలక్‌ను నియమించారు.
అలాగే, అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే... మూడో జాబితాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా, మూతిరేవులు సునీల్ కుమార్‌ను ఇన్‌చార్జిగా పేర్కొన్నారు. ఎంఎస్ బాబు ఇటీవలే మీడియా ముందుకు వచ్చి తనకు ఈసారి టికెట్ వచ్చే అవకాశాల్లేవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇన్‌చార్జిలను మార్చుతున్నారంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అదేవిధంగా, గత గొంతకాలంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై ఇష్టానురాజ్యంగా చెలరేగిన మంత్రి జోగి రమేశ్‌కు స్థాన చలనం కలిగింది. ఆయనను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. ఈయన గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు., పెనమలూరు టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కె.పార్థసారథికి సీఎం జగన్ షాకిచ్చారు. ఈ మూడో జాబితాలో ఆరు ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌చార్జిలను ఎంపిక చేసి, అధికారికంగా ప్రటించారు.