ప్రజారాజ్యం "మెగా" నేతకు వివాదాల సెగ

గురువారం, 4 సెప్టెంబరు 2008 (20:22 IST)
ప్రజారాజ్యం పార్టీతో ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని అప్పుడే వివాదాల వడగాలులు చుట్టుముడుతున్నాయి. సినీ నటుడిగా రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్ర ప్రజలను కూడా అలరించిన చిరంజీవి తన మూడు పదుల నటనా ప్రస్థానంలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత దూషణలకు సైతం వెరవని రాజకీయ చదరంగంలో... ఆయన అడుగిడిన నాటినుంచి విమర్శలు ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్నాయి. అన్నప్రాశననాడే ఆవకాయ అన్న చందంగా తొలి వివాదమే చిరంజీవికి చిత్రంగా ఎదురైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన పార్టీ పేరు ప్రకటించిన మరుసటి రోజే "ప్రజారాజ్యం" తనదంటూ కడప జిల్లా వాసి చెన్న కృష్ణయ్య పత్రికలకెక్కారు. ఈ వార్త చిరు శిబిరంపై పిడుగులా తాకింది. అయితే ఆ సమస్య వచ్చినంత వేగంగానే తిరుగుముఖంపట్టి సద్దుమణిగింది.

కానీ పార్టీ పేరును ఉపసంహరించుకునేలా చేయడానికి చిరంజీవి చెన్న కృష్ణయ్యతో లాలూచీ పడ్డారని అనేక విమర్శలు వచ్చాయి. ఇదిలావుంటే తాజాగా మరో వివాదం చిరంజీవిని చుట్టుకోవడానికి సిద్ధమైంది. తమను కాదని తమ కన్నకూతురుకి చిరంజీవి దగ్గరుండి బలవంతపు వివాహం జరిపించారని గురువారం సదరు వధువు తల్లితండ్రులు మీడియాను ఆశ్రయించారు.


తమ్మిన సుబ్బారావు అతని భార్య ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ చిరంజీవి ప్రమేయంతోనే తమ కుమార్తెకు ఇష్టంలేని వివాహం జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు చిరంజీవిపై కొన్ని ఆరోపణలు చేయడం గమనార్హం.

ఇటీవల చిరు పార్టీలో చేరిన కత్తి పద్మారావు కుమారునితో జరిగిన తమ కుమార్తె వివాహం పూర్తిగా చిరంజీవి ఆధ్వర్యంలోనే జరిగిందని ఆరోపించారు. తమకు తెలియకుండా జరిగిన ఈ పెళ్లిలో తమ కుమార్తెను దత్తత చేసుకుని మరీ పెళ్లి జరిపించిన చిరంజీవికి అంత అవసరం ఏం వచ్చిందని వారు ప్రశ్నించారు.

ఫిలిం క్లబ్‌లో జరిగిన ఈ వివాహం... చిరంజీవి అండ లేకుంటే ఎలా అనుమతి దొరికిందని ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంటే ఎంతో బాధపడ్డ చిరంజీవి ఇప్పుడు తమ కుమార్తె విషయంలో ఇలా దగ్గరుండి మరీ ఇష్టం లేని వివాహం చేయడం ఎంత వరకు సమంజసమని విమర్శించారు.

"ఇలా ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడానికేనా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ...? అని ఆమె ప్రశ్నించింది. ఈ ప్రశ్నలన్నిటికీ చిరంజీవి సమాధానం చెబుతారో లేదో ప్రస్తుతం అనవసరం. అయితే రాజకీయాలంటే సమస్యలు ఏ వైపు నుంచి ఎలా వచ్చిపడతాయో అన్నదానికి ఇటువంటి సంఘటనే పెద్ద ఉదాహరణ.

మొత్తంమీద తెలిసిన విషయమేమంటే... రాజకీయ రంగ ప్రవేశానంతరం నాయకుని కదలికపై అనుక్షణం అందరి కళ్లూ ఉంటాయి. విమర్శకులు కళ్లు వళ్లంతా చేసుకుని మరీ చూస్తుంటారు. సుమారు మూడు దశాబ్దాల సినీ పయనంలో ఎలాంటి విమర్శలు లేకుండా ఎలాంటి సంజాయిషీలూ ఇచ్చుకోకుండా వచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం రాజకీయ నేతగా తనపై వచ్చే విమర్శలను ఎలా తిప్పికొడతారో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి