మనం ఎంత వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించాలని ప్లాన్ వేసి ఇంటి నిర్మాణం తలపెట్టినా వాస్తుశాస్త్రవేత్తల సలహాలు పాటించిన, గృహస్తుడు తనంటూ కొన్ని విషయాలు తెలుసుకొని గృహ నిర్మాణము చేపట్టునప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ప్రతిరోజు వాస్తుశాస్త్రవేత్త మీ గృహ నిర్మాణం పరిశీలించుటకు రాడు కదా.. ముందుగా ప్రహరీలు లేకుండా గృహ నిర్మాణం చేయకూడదని గృహస్తుడు తెలుసుకోవాలి. ప్రహరీల నిర్మాణానికి పునాది తవ్వకం ఈశాన్యం నుంచి మొదలు పెట్టి ఉత్తరం, తూర్పు పశ్చిమ దక్షిణాలుగా తవ్వి చివరిగా నైరుతిలో పునాది తవ్వాలి.
కట్టడం మాత్రం నైరుతి మూల మొదలు పెట్టాలి. గ్రృహనిర్మాణానికి రాయి, ఇటుక, ఇసుక సిమెంటు వంటి వాటిని తూర్పు, ఉత్తర ఈశాన్యాలలో వేయకూడదు. ఇల్లు శాస్త్రప్రకారం నిర్మాణం చేయునపుడు ప్రధాన గృహము నైరుతిలో నిర్మితమవుతూ వుండును. కాబట్టి తూర్పు, ఉత్తరాలలో ఖాళీ వుండుటవలన సాధారణంగా తూర్పు, ఉత్తరాలలో ఇసుక, రాయి, ఇటుక, సిమెంటు వేస్తుంటారు. ఈ విధంగా చేయుట పొరపాటు. ఆగ్నేయ, వాయువ్యాలలో వేయవచ్చు. లేదా మీ పక్క స్థలాలను ఇందునిమిత్తమై ఉపయోగించుటలో తప్పులేదు. అయితే మీ ఇంటికి వాస్తు సమ్మతమైన ప్రహరీ వుండితీరాలి.
శాస్త్రవిరుద్దంగా ఇసుక, రాయి, ఇటుక వంటి వాటిని స్థలంలో వేసినచో గృహనిర్మాణం చిక్కులలో పడటం, ఆగిపొవడం వంటివి జరుగుతాయి. ఈశాన్యం బోరింగ్ గాని, నుయ్యి గాని, కుళాయిని గాని ఏర్పాటు చేసికొని ఆ నీటితో గృహ నిర్మాణం చేయటం ఉత్తమం. వీలైతే ఇంటికి నైరుతి గదిని ముందుగా నిర్మించి అందు సిమెంట్, కలప వంటి సరుకును ఉంచుకొని గృహ నిర్మాణం చేయటం మరీ ఉత్తమం.
ఇంటికి లింటల్ లెవెల్ సన్ షెడ్ వేయునపుడు ఉత్తరం, తూర్పు గృహలకు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయాలు తెగిపోకుండా జాగ్రత్తపడాలి. ఇంటి పైకప్పు వేయునప్పుడు నైరుతి ఎత్తుగా వుంచి, వాయువ్యం కన్నా ఆగ్నేయం ఎత్తుగాను, ఈశాన్యం కన్నా వాయువ్యం ఎత్తుగాను ఉండేలా లెవెల్ సరిచేసుకోవాలి. అలాగే, ఫ్లోరింగ్ విషయంలో కూడా లెవెల్ సరిచేయాలి. మట్టి కోసంగాను మరేంగాని మరే ఇతర అవసరాలకుగాని ఇంటి ఆవరణలో శాస్ర్తవిరుద్ధంగా గుంటలు తీయకూడదు.
ఇంటి గోడలకు ప్లాస్టరింగ్ చేయునపుడు ప్రతి గదికి ఈశాన్యం తగ్గకుండా చూసుకోవాలి. ఉత్తరం, తూర్పుగోడలకు ఆనుకుని షోకేసులు, రోళ్ళు, తిరగళ్ళు వంటివి ఏర్పాటు చేయకూడదు. ఇంటికి లింటిల్ లెవెల్‌లోగాని, పైకప్పులోగాని ఈశాన్యం తెగిపోకుండా జాగ్రత్తపడాలి.