40 ఏళ్లు దాటిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

శనివారం, 13 జులై 2019 (18:36 IST)
మహిళలు 40 ఏళ్లు దాటాక వారివారి ఆహారపు అలవాట్లలో కాస్త మార్పులు చేసుకోవాలి. 40 ఏళ్లకి ముందు ఆహారంపై నియంత్రణ లేకుండా ఏది పడితే అది తినడం అలవాటయినప్పటికీ, ఇకనుంచీ జాగ్రత్తపడాలనే వైద్యుల సలహాలిస్తున్నారు. హడావుడిగా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం కాకుండా ఏం కావాలో అది మాత్రమే తినాలన్న నియమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలని చెపుతున్నారు. 
 
సూపర్ మార్కెట్‌కు వెళ్లాక అక్కడ నోరూరించే ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి కొనాలని ఉద్యోగినులు ప్రయత్నిస్తారు. అయితే వాటిలో ఉండే పోషకాలగురించి చదవండి. కొవ్వుశాతం, కెలోరీలు, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని అప్పుడు కొనండి. చిప్స్ బర్గర్లు పిజ్జాలు వంటివి పిల్లలకు పెద్దలకు కూడా ఇష్టమే. వాటి బదులు పండ్లను రుచిచూడండి. ఇంకా సలాడ్ల రూపంలో తీసుకోండి. శీతలపానీయాల బదులు పండ్లరసాలు తాగండి. పీచు తగినంత అందుతుంది కాబట్టి ఒళ్లు పెరగదు.
 
పుదీనా కొత్తిమీర కరివేపాకు, మెంతి ఆకు, తదితరాలను వంటకాల్లో ఎక్కువగా చేర్చండి. అవి ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాదు తక్కువ కెలోరీలు అందిస్తాయి. ఎలాంటి కూరలనైనా నోరూరించేలా చేస్తాయి. పొద్దున్నే ఉపాహారం తినడం మానేయకండి. ఉపాహారం మానేస్తే అధికబరువు సమస్య రెట్టింపవుతుందని మరువకండి. ఒకే సారి ఎక్కువగా తినకుండా ప్రతిరెండు మూడు గంటలకోసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోండి.
 
అన్నిటికంటే మించి వండే వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నీళ్ల సీసా పక్కన పెట్టుకుని నీళ్లు తాగుతుండాలి. టీవీ చూస్తూ, పుస్తకం చదువుతూన్నప్పుడు తినాలనిపిస్తే పండ్లు, వేయించిన వేరుశనగలు, మొలకెత్తిన గింజలు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వండి. 
 
జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడితే నెమ్మది నెమ్మదిగా తగ్గించండి. వీలైనంతవరకూ వాటిని ఇంటికి తీసుకురావద్దు. ఇవి జీవనవిధానంలో మార్పులే కాని డైటింగ్ నియమాలు కావు. కాబట్టి వీటిని పాటించడం కష్టం కాదు. నడివయస్సులో లావు తగ్గించుకోవాలంటే ఆహారంలో ఇలాంటి మార్పులు తీసుకురావడం తప్పనిసరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు