మహిళల్లో 30 దాటితే ఎముకల బలం తగ్గిపోతూ వస్తుంది. ఇందుకు ఎముకల్లోని క్యాల్షియం శక్తి తగ్గుతూ రావడమే కారణం. తద్వారా వెన్నునొప్పి, కీళ్లనొప్పులు ఏర్పడతాయి. అందుకే శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే.. క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం.
ముఖ్యంగా క్యాల్షియం అనేది మహిళలకు ఎక్కువ కావాల్సి వుంది. ఎందుకంటే..? నెలసరి, ప్రసవం సమయాల్లో మహిళల్లోని క్యాల్షియం చాలామటుకు టాక్సిన్ల రూపంలో తొలగిపోతుంది. అందుకే మహిళలు రోజూ రెండు గ్లాసుల పాలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే పాల ఉత్పత్తులు పన్నీరు, పెరుగు, మజ్జిగ, చీజ్ వంటివి తీసుకోవడం చేయాలి.
అలాగే క్యాల్షియం పొందాలంటే.. సిట్రస్ ఫ్రూట్స్‌ల్లో ఒకటైన ఆరెంజ్‌ను తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి, క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక సీఫుడ్స్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే రొయ్యల్ని మాసానికి రెండుసార్లు తీసుకోవాలి. వీటిని ఎక్కువ సేపు ఉడికిస్తే అందులోని క్యాల్షియం తొలగిపోతుంది.
ఆకుకూరలు, బ్రొకోలీ, బాదంను రోజూ తీసుకోవాలి. అలాగే నువ్వుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక టీ స్పూన్ నువ్వుల్లో ఒక గ్లాసు పాలల్లోని క్యాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే నువ్వుల్ని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.