'బ్లాక్ పాంథర్' హీరో చాద్విక్ బోస్‌మన్, క్యాన్సర్‌తో మృతి

శనివారం, 29 ఆగస్టు 2020 (13:24 IST)
బ్లాక్ పాంథర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు చాద్విక్ బోస్‌మన్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు ఆయన కుటుంబం చెప్పింది. ఆయన వయసు 43 సంవత్సరాలు. లాస్ ఏంజెలెస్ నగరంలోని తన ఇంట్లోనే చనిపోయారు. ఆ సమయంలో భార్య, కుటుంబ సభ్యులు ఆయన వద్దే ఉన్నారు.
 
బోస్‌మన్‌కు స్టేజ్-3 కొలన్ క్యాన్సర్ ఉన్నట్లు 2016లో గుర్తించినట్లు ఆయన కుటుంబం తెలిపింది. నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతూనే పలు సినిమాల్లో పాత్రలకు జీవం పోశారని పేర్కొంది. బేస్‌బాల్ దిగ్గజం జాకీ రాబిన్సన్, ప్రముఖ సంగీతకారుడు జేమ్స్ బ్రౌన్ జీవిత కథలతో రూపొందించిన చిత్రాల్లో వారి పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు బోస్‌మన్.
 
అయితే.. 2018లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన 'బ్లాక్ పాంథర్'లో కింగ్ టిచల్లా పాత్రలో ఆయన గుర్తిండిపోతారు. ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేట్ అయిన తొలి సూపర్ హీరో సినిమా బ్లాక్ పాంథర్ కావటం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు