బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?

సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (16:40 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉచిత వంట గ్యాస్, పింఛను తదితర అవసరాలకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.2.76 లక్షల కోట్ల కేటాయింపు.

 
మూడు ఆత్మనిర్భర్ ప్యాకేజీలకు రూ.27.1 లక్షల కోట్ల కేటాయింపు. ఈ మొత్తం జీడీపీలో 13 శాతానికి సమానం. బడ్జెట్ 2021-22ను ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం అయ్యే దిశగా పడిన అడుగుగా చెప్పుకోవచ్చు. బడ్జెట్‌కు ఆరు మూల స్తంభాలివీ: ఆరోగ్యం, సంరక్షణ; ఆర్థిక పెట్టుబడులు, మౌలిక వసతుల నిర్మాణం; సమ్మిళిత అభివృద్ధి; మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, కనీస ప్రభుత్వం-గరిష్ఠ పాలన.

 
మొదటి స్తంభం: ఆరోగ్యం, సంరక్షణ
త్వరలో పోషన్ 2.0 ప్రారంభం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కేంద్రం ఏర్పాటు
2.86 కోట్ల ఇళ్లకు మంచి నీటి ట్యాప్ సదుపాయం
15 అత్యవసర ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు
వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు
స్వచ్ఛంద వాహన తనిఖీ విధానం
మొత్తంగా ఈ విభాగానికి రూ.2,23,846 కోట్ల కేటాయింపు. గతేడాది కంటే ఇది రూ.94,452 కోట్లు ఎక్కువ. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 137 శాతం ఎక్కువ.

 
రెండో స్తంభం: ఆర్థిక పెట్టుబడులు, మౌలిక వసతుల నిర్మాణం
డెవలప్‌మెంట్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ బిల్లు త్వరలో పార్లమెంటుకు
మూడేళ్లలో 7 జౌళీ పార్కుల ఏర్పాటు
ప్రభుత్వ ఆస్తుల నుంచి ఆదాయ పెంపుపై దృష్టి
మౌలిక సదుపాయాల రుణాల కోసం రూ.5 లక్షల కోట్లు
మౌలిక పెట్టుబడుల కోసం గతేడాది రూ.నాలుగు లక్షల కోట్ల కేటాయింపు. 2021-2022లో దీన్ని 5.54 లక్షల కోట్ల రూపాయలకు పెంపు
మౌలిక పెట్టుబడులపై వ్యయం కోసం రాష్ట్రాలు, స్వతంత్ర పరిపాలన సంస్థలకు రూ.2 లక్షల కోట్లు.
భారత్ మాల కింద 13,000 కి.మీ.ల రోడ్డు మార్గాల నిర్మాణం
తమిళనాడులో ఆర్థిక నడవా: 3,500 కి.మీ మార్గంలో 1.03 లక్షల కోట్ల రూపాయలతో చిత్తూర్-కుచూర్ నడవా; కేరళలో రూ.65,000 కోట్లతో 1100 కి.మీ. మేర జాతీయ రహదారుల నిర్మాణపు పనులు, పశ్చిమ బెంగాల్‌లో రూ.25,000 కోట్లతో 675 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, అసోంలోనూ 1300 కి.మీ. మేర రహదారుల అభివృద్ధి.
రహదారుల రవాణా శాఖకు రూ.1.18 లక్షల కోట్ల కేటాయింపులు.
ఖరగ్‌పుర్ నుంచి విజయవాడ వరకు ఈస్ట్‌కోస్ట్ ఆర్థిక నడవా; విజయవాడ నుంచి ఇటార్సీ వరకు నార్త్-సౌత్ కారిడార్; తెలంగాణలో ఆర్థిక నడవా గురించి ప్రస్తావించలేదు.
రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపులు.
హైదరాబాద్‌లో ఎంఎంఆర్‌టీ సర్క్యూట్, ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో గురించి ప్రస్తావించ లేదు. కోచి మెట్రోకు రూ.1957 కోట్ల కేటాయింపు, బెంగళూరు, చెన్నై మెట్రోల విస్తరణ.
పట్టణ ప్రాంతాలకు కొత్తగా 20,000 కొత్త బస్సులు
ఉజ్వల కింద కొత్తగా మరో కోటి మందికి లబ్ధి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ పరిధిలోకి మరో వంద జిల్లాలు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
ఎల్‌ఐసీ ఐపీవో జారీ, ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు
సులభతర వాణిజ్యం కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాలు

 
మూడో స్తంభం: సమ్మిళిత అభివృద్ధి
2021-22 కోసం వ్యవసాయ రంగ టార్గెట్ రూ.16.5 లక్షల కోట్లు. పశు సంవర్ధక శాఖ, మత్స్య విభాగం, డెయిరీ టార్గెట్‌లు దీనిలో కలిపే ఉన్నాయి.
2013-14లో వరి కోసం రూ.63,928 కోట్ల కేటాయింపు. 2019లో ఇది రూ.1.41 లక్షల కోట్లు ఉండగా.. 2020-2021లో దీన్ని 1.72 లక్షల కోట్లకు పెంపు.
పప్పు ధాన్యాల సేకరణకు 2013-14లో రూ.236 కోట్ల కేటాయింపు, 2019-20లో ఇది 8,285 కోట్లుగా ఉండగా ప్రస్తుతం దీన్ని రూ.10,530 కోట్లకు పెంచారు. అంటే 2013 నాటితో పోలిస్తే 40 రెట్లు కేటాయింపులు పెరిగాయి.
కనీస మద్దతు ధర నుంచి లబ్ధి పొందిన రైతుల సంఖ్య 2019-20లో 1.24 కోట్లుగా ఉండగా.. 2020-21లో ఇది 1.54 కోట్లకు పెరుగుతున్నట్లు అంచనా.
పారాదీప్, కోచిలలో ఐదు మత్స్యకార పోర్టుల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించలేదు.

 
నాలుగో స్తంభం: మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి
లద్దాఖ్‌లో కేంద్ర యూనివర్సిటీ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా వందకుపైగా సైనిక స్కూళ్ల ఏర్పాటు
నైపుణ్యాభివృద్ధికి రూ.3,000 కోట్లు

 
స్తంభం 5: ఆవిష్కరణలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
డిజిటల్ పేమెంట్‌ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్లు
స్తంభం 6: కనీస ప్రభుత్వం-గరిష్ఠ పాలన.
జన గణన ఈ సారి డిజిటల్ రూపంలో నిర్వహణ. దీని కోసం రూ.3,700 కోట్ల కేటాయింపు

 
గణాంకాలివీ..
మూలధన పెట్టుబడి రూ.4.39 లక్షల కోట్లు. 2020-21లో ఇది 4.12 లక్షల కోట్లుగా ఉండేది. ఆర్థిక లోటు జీడీపీలో 9.5 శాతం వరకూ ఉంది. 2021 బడ్జెట్ అంచనా రూ.34.83 లక్షల కోట్లు. దీనిలో పెట్టుబడుల వాటా 5.54 శాతం. ఆర్థిక లోటు 6.5 శాతంగా ఉంది. రుణాల మొత్తం విలువ రూ.12 లక్షల కోట్లు. 2024-25 నాటికి ఆర్థిక లోటును 4.5 శాతానికి తగ్గించేందుకు కృషి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణ. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం 41 శాతం నిధులు రాష్ట్రాలకు మళ్లింపు, 17 రాష్ట్రాలకు రూ.1.8 లక్షల కోట్ల రెవెన్యూ గ్రాంట్లు. 2020-21లో 14 రాష్ట్రాలకు రూ.70,000 కోట్ల కేటాయింపు.

 
పన్నులు ఇలా...
కేవలం పింఛను మాత్రమే తీసుకునే 75ఏళ్లకు పైబడిన వృద్ధులను ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు నుంచి మినహాయింపు. 50 లక్షల వరకు ఆదాయం ఉండే పన్ను చెల్లింపు దారుల కోసం వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు. రూ.పది లక్షల వరకు పన్ను చెల్లింపు వివాదాలకు సంబంధించి ఈ కమిటీని ఆశ్రయించొచ్చు.

 
జాతీయ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు
95 శాతం వరకు లావాదేవీలను డిజిటల్ రూపంలో జరిపే కంపెనీల ట్యాక్స్ ఆడిట్ విషయంలో పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు. అంటే టర్నోవర్ రూ.పది కోట్ల వరకు ఉండే సంస్థలు కూడా ఇప్పుడు ట్యాక్స్ ఆడిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు రెండుసార్లు ట్యాక్స్ కట్టకుండా వెసులుబాటు. రీ-ట్యాక్సేషన్‌కు మార్గం సులభతరం. అంకుర సంస్థల ట్యాక్స్ హాలిడే పొడిగింపు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు పేరుతో కొత్త పన్ను. అయితే, ఇది వినియోగదారులకు భారం కాకుండా ఉండేందుకు చర్యలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు