కాంగ్రెస్ పార్టీ: రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఎన్నికల ఫలితాల్లో మార్పు ఉండేదా?

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (13:52 IST)
మీరు దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లయితే ఎన్నికల ఫలితాల సరళి తెలుసుకునేందుకు టీవీనో లేదంటే మొబైల్ ఫోన్‌పైనో కన్నేయాల్సిన అవసరమే ఉండదు. ఉదయం కొన్ని గంటల వరకూ అక్కడ నిశ్శబ్దంగా ఉందంటే, ఫలితాల సరళి వారికి ప్రతికూలం అనే విషయం అర్థమైపోతుంది.

 
ట్రెండ్స్‌లో ట్విస్ట్ వచ్చిదంటే లేదా కొత్త మలుపు వచ్చిందంటే అక్కడ కాస్త హడావుడి మొదలవుతుంది. బాడీ లాంగ్వేజ్ మారుతూ కనిపిస్తుంది. మెల్లగా ఉత్సాహం పెరుగుతుంది. ఫలితాలు తమ అంచనాలను మించిపోతే అగ్ర నేతలు కూడా పెద్ద పెద్ద కారుల్లో ఆఫీసు దగ్గరికి చేరుకుంటారు. మాయమైపోయిన నేతలు హఠాత్తుగా ప్రత్యక్షం కావడం మొదలెడతారు.

 
గురువారం ఉదయం కూడా కాస్త అలాగే కనిపించింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత మొదటి ట్రెండ్స్ వచ్చేవరకూ 24-అక్బర్ రోడ్ అంటే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం లోపల పరిస్థితి చల్లగా ఉంది. కానీ రోజు గడిచేకొద్దీ ఫలితాల ట్రెండ్స్‌లో ట్విస్ట్ వచ్చేకొద్దీ, ఇక్కడ ఉత్సాహం కూడా పెరిగింది. ఆఫీసులో కార్యకర్తల సంఖ్య పెరగింది. కొంతమంది సీనియర్ నేతల రాక కూడా మొదలైంది. వాళ్లంతా ఓటమి తప్పదని ఉదయం అనుకున్నారు. పార్టీకి చెందిన ఒక హరియాణా నేత జగదీశ్ శర్మ పార్టీ ఓడిపోతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను తప్పుగా ఉపయోగించడమే దానికి కారణం కారణం అన్నారు.

 
మధ్యాహ్నం తర్వాత ఫలితాల సరళిలో స్పష్టత రావడం మొదలైంది. దానితోపాటు కాంగ్రెస్ కార్యాలయంలో వాతావరణం కూడా వేడెక్కింది. కాస్త జోష్ కూడా కనిపించింది. "మా రాష్ట్రంలో ఓటర్లు బీజేపీని పక్కనపెట్టారు" అని హరియాణా నుంచి ఆ పార్టీ నేత జయవీర్ షేర్‌గిల్ మాతో అన్నారు. "స్వతంత్ర అభ్యర్థులు, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలా సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది" అని ఆయన గట్టిగా చెప్పారు.

 
రాహుల్ రాజీనామా చేయకుంటే...
మహారాష్ట్రలో కూడా ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలను బట్టి పార్టీ మెరుగైన ప్రదర్శనే ఇచ్చిందని షేర్‌గిల్ అన్నారు. "మేం ఎన్నికల ప్రచారంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలను లేవనెత్తడం వల్లే మా పార్టీ అభ్యర్థులు మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. మోదీ ప్రభుత్వం కశ్మీర్, ఆర్టికల్ 370 అంశాలను లేవనెత్తింది. ప్రజలు దానిని పట్టించుకోలేదు" అని పార్టీ ప్రధాన కార్యాలయంలో జగదీశ్ శర్మ, మిగతా కార్యకర్తలు అన్నారు.

 
కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నేతలు ఆన్ రికార్డ్ ఎంత మాట్లాడతారో, ఆఫ్ ద రికార్డ్ అంతకంటే ఎక్కువే మాట్లాడతారు. తమ పార్టీ ప్రదర్శనను సమీక్షిస్తూ ఒక ప్రతినిధి.. "రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడుగా రాజీనామా చేయకపోయుంటే, కార్యకర్తల డిమాండ్ ప్రకారం ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉంటే, మహారాష్ట్రలో కూడా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చుండేవాళ్లం" అన్నారు.

 
ఇప్పుడు హరియాణా, మహారాష్ట్రలో ఏర్పడేది ఎవరి ప్రభుత్వాలు అయినా, ఫలితాల సరళి నుంచి ఒకటి మాత్రం స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ తను అనుకున్న దానికంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. దీనిపై షేర్‌గిల్.. "మీడియా, ఎగ్జిట్ పోల్ మమ్మల్ని తొక్కేశాయి. ఇక, మా పని అయిపోయిందని చెప్పాయి. ఇప్పుడు వచ్చిన ఫలితాలకు వాళ్లంతా ఏమంటారో" అన్నారు.

 
మీడియా ఎగ్జిట్ పోల్‌ను పక్కనపెడితే, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న భారత మీడియా ప్రతినిధులు ట్రెండ్స్‌లో ట్విస్ట్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌ను ఎన్నికల డస్ట్ బిన్‌లో విసిరేయడానికి సిద్ధపడ్డారు. ఫలితాల సరళి మారిన తర్వాత ఒక జర్నలిస్ట్ లైవ్‌లో మాట్లాడుతూ "మునిగిపోతున్న కాంగ్రెస్‌కు గడ్డిపోచ అండ లభించింది" అన్నారు.

 
తడిసిన చొక్కానే కారణమా...
నిజం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లోపల కూడా కొందరికి రెండు రాష్ట్రాల్లో తమ ప్రదర్శన ఇంత బాగా ఉంటుందని నమ్మకం లేదు. వాళ్లు ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచార సమయంలో బీబీసీతో మాట్లాడిన మహారాష్ట్రలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. లీడర్‌షిప్ వల్ల నిరుత్సాహంగా ఉందని, అందుకే, తాము పూర్తిగా తమ సామర్థ్యాన్ని చూపించలేకపోయామని అన్నారు. "రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య లుకలుకలు లేకుంటే పార్టీ మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చుండేది" అని షేర్ గిల్ అన్నారు.

 
"రాహుల్ గాంధీ మహారాష్ట్రలో కేవలం ఆరు ర్యాలీలు చేశారు, హరియాణాలో రెండు ర్యాలీలకు వెళ్లారు. కానీ, అప్పుడే ఆయన హెలికాప్టర్‌లో ఏదో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో ర్యాలీలు రద్దు చేయాల్సి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్క ర్యాలీ కూడా చేయలేదు. చూస్తుంటే, "ఇద్దరు నేతలూ మ్యాచ్‌కు ముందే ఓటమి ఒప్పుకున్నట్టు అనిపించింది.


కానీ వాస్తవం ఏంటంటే గత ఏడాదిగా మహారాష్ట్రలో మూడుసార్లు పర్యటించిన నాకు, బీజేపీ కార్యకర్తలు నరేంద్రమోదీ పట్ల ఎంత నమ్మకంగా ఉంటారో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పట్ల కూడా అంతే విశ్వాసం ఉంచినట్టు కనిపించింది. కాంగ్రెస్‌కు గుడిసెల నుంచి గ్రామాల వరకూ ఇప్పటికీ ఆదరణ ఉండడం నేను చూశాను" అన్నారు షేర్ గిల్.

 
మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ పదికి పైగా ర్యాలీలు తీశారు. ఒక ర్యాలీలో భారీ వర్షం కురిసింది. 78 ఏళ్ల పవార్ పూర్తిగా తడిసిపోయారు. ఆయన వేసుకున్న తెల్ల చొక్కా తడిసి ముద్దైంది. ఆ ఫొటో మహారాష్ట్ర ఓటర్లపై ఇంత తీవ్రమైన ప్రభావం చూపిందా.. బహుశా అయ్యుండచ్చు. ఎన్సీపీలోని చాలామంది నేతలు పార్టీని వీడి బీజేపీ, శివసేనలో చేరారు. దాంతో, ఆ పార్టీ అసలు తన ఉనికిని నిలబెట్టుకోగలదా అని ఎన్నికలకు ముందు అనిపించింది.

 
అధికారం అందకపోయినా, బలమైన ప్రతిపక్షం
కానీ ఎన్నికల ప్రచార సమయంలో నాతో మాట్లాడిన పార్టీ నేత నవాబ్ మాలిక్.. "మా పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతల వల్ల, నా నిద్రకు ఎలాంటి సమస్యా రాలేదు" అన్నారు. "మా యువ నేతలకు ఇదో మంచి అవకాశం అవుతుంది. ఈసారి కాకపోతే, ఇంకోసారి… మేం కచ్చితంగా గెలుస్తాం" అన్నారు.

 
పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని శరద్ పవార్ కూడా పట్టించుకోలేదు. కానీ మీడియా మాత్రం ఆ పార్టీ పని ముగిసిందని రాయడం మొదలుపెట్టాయి. కానీ, పార్టీని వదిలి వెళ్లిన ఆ నేతల ప్రదర్శన గొప్పగా లేదు. తర్వాత పవార్ కూడా ప్రజలే వారిని పక్కనపెట్టారని అన్నారు.

 
ఎన్సీపీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకుని ఒంటరిగా పోటీ చేసింది. అంతకు ముందు రెండు పార్టీలూ కలిసి మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. వరసగా మూడుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దాంతో, 2014లో చేసిన పొరపాటును మరోసారి చేయకూడదని రెండు పార్టీలూ ఈసారి మళ్లీ పొత్తు పెట్టుకున్నాయి.

 
కాంగ్రెస్, ఎన్సీపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చు. కానీ అది కచ్చితంగా ఒక బలమైన ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది. అలాగే హరియాణాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ, బలమైన విపక్షంగా ప్రభుత్వంపై ఒక కన్నేసి ఉంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు