కరోనావైరస్‌ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
మంగళవారం, 18 మే 2021 (12:57 IST)
"ఇప్పుడు ఎలా ఉంది? పూర్తిగా తగ్గిందా లేకా ఇంకా అవస్థ పడుతున్నారా? నెగటివ్ రిపోర్ట్ వచ్చిందా?" గత ఏడాది కాలంగా మీరెంతో మందిని ఈ ప్రశ్నలు అడిగి ఉంటారు. లేదా వీటికి మీరే జవాబులు చెప్పి ఉండవచ్చు. మన ఆత్మీయుల గురించి మనం పడుతున్న బాధను ఏ ప్రభుత్వ గణాంకాలూ లెక్కించలేవు. లెక్కలు ఏమైనా చెప్పాలంటే, ఇప్పటివరకు భారత్‌లో రెండు కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పవచ్చు. అలాంటివారందరి కోసమే ఈ కథనం.
కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా చాలామంది అనేక రకాల బాధలు పడుతున్నారు. కొంతమందికి విపరీతమైన నీరసం ఉంటోంది. కొంతమందికి ఊపిరి సరిగా అందడం లేదు అంటున్నారు. కొంతమందికి కొత్తగా గుండె జబ్బులు వస్తున్నాయి. ఇంకా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ బాధలన్నీ కొన్ని నెలలపాటు కొనసాగుతున్నాయి. అందుకే పోస్ట్-కోవిడ్ కేర్ కూడా కోవిడ్ కేర్ అంత ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు.
కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించారో అంతే శ్రద్ధగా కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా శక్తిని పుంజుకోవడానికి ప్రయత్నించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
శరీరంపై కోవిడ్ 19 ప్రభావం
కోవిడ్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగాలపై ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పటికీ కోవిడ్ అంటే జలుబు, దగ్గు, కొంచెం జ్వరం అని చాలామంది భావిస్తున్నారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినది మాత్రమే అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఈ వ్యాధి కొత్తది కనుక ఇతర అవయవాలపై దాని ప్రభావం క్రమంగా బయటపడుతుంది.
కరోనావైరస్ ప్రభావం గుండె, మెదడు, కండరాలు, ధమనులు, సిరలు, రక్తం, కళ్లు, శరీరంలోని అనేక ఇతర అవయవాలపై కూడా ఉంటోందని ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత గుండెపోటు, నిస్సత్తువ, అలసట, ఒళ్లు నొప్పులు, రక్తం గడ్డకట్టడం, బ్లాక్ ఫంగస్ లాంటి సమస్యలను ఎదుర్కోడానికి కారణం ఇదే. అందుకే పోస్ట్-కోవిడ్‌లో శరీరంలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయవద్దని, ఈ సమస్యలు ముదిరినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తేలికపాటి కోవిడ్ లక్షణాలతో కోలుకున్న తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కోవిడ్ సోకినవారిలో 90% మంది ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని భారత ప్రభుత్వం చెబుతోంది. వీరికి ఆస్పత్రి అవసరం రానప్పటికీ కోవిడ్ తరువాత తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. "తేలికపాటి లక్షణాలున్న రోగులు కూడా పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 8 వారాలు పట్టొచ్చు. కోలుకునే సమయం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.
బలహీనత, ఎక్కువసేపు పనిచేస్తే అలసిపోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర లేమి, శరీరంలో నొప్పులు, తేలికపాటి జ్వరం, గాబరాగా ఉండడం.. ఇవన్నీ కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు" అని సర్ గంగారాం ఆస్పత్రి మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ ఎస్‌పీ బ్యోత్రా చెప్పారు. డాక్టర్ బ్యోత్రా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.
తేలికపాటి లక్షణాలతో కోవిడ్ నుంచి కోలుకున్నవారికి డాక్టర్ బ్యోత్రా ఇస్తున్న సలహాలు, సూచనలు:
మీకు పూర్తిగా స్వస్థత చేకూరిందని అనిపిస్తే, నెగటివ్ రిపోర్ట్ అవసరం లేదనిపిస్తే... మళ్లీ టెస్ట్ చేయించుకోకండి. 14 రోజుల తరువాత ఐసొలేషన్ నుంచి బయటకు రావొచ్చు. భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రికవరీ సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ప్రోటీన్లు, తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ వ్యాధి సోకిన వారికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బలమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.
తినాలని అనిపించకపోతే కొంచెం కొంచెంగా తినండి. ఎక్కువసార్లు తినండి. బాగా నీళ్లు తాగాలి. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఒకేసారి ఎక్కువసేపు పని చేయకండి. కోలుకున్న తరువాత అంటే 15 నుంచి 30 రోజులవరకూ ఆక్సిజన్, జ్వరం, రక్తపోటు, చక్కెర స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలి.
వేడి నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టాలి. రోజుకు 8-10 గంటలు నిద్రపోవాలి. బాగా విశ్రాంతి తీసుకోవాలి. ఏడు రోజులకోసారి డాక్టర్‌తో చెకప్ చేయించుకోవాలి.
తేలికపాటి లక్షణాలతో కోలుకున్న రోగులు 10 నుంచి 15 రోజుల్లో విధుల్లోకి వెళ్లవచ్చు. పాత దినచర్యకు చేరుకోవచ్చు. డాక్టర్లు మందులు ఏవైనా సూచిస్తే అవి క్రమం తప్పకుండా తీసుకోవాలి. అవి ఆపేసే ముందు డాక్టర్‌ను కచ్చితంగా సంప్రదించాలని డాక్టర్ బ్యోత్రా సూచించారు. కో-మార్బిడీస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహాలను తప్పక పాటించాలి. అంతే కాకుండా, పొగ తాగడం, మద్య పానానికి దూరంగా ఉండాలి. ఇంట్లోనే కోలుకున్నవారు తమ శరీరాల్లోని మార్పులను గమనిస్తూ ఉండాలి. మార్పుకు కారణం అర్థం కాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని డాక్టర్ బ్యోత్రా చెబుతున్నారు.
మధ్యస్థం లేదా తీవ్ర లక్షణాలు ఉన్నవారు ఏం చేయాలి?
"తీవ్ర లక్షణాలతో కోవిడ్ నుంచి కోలుకున్న వారందరికీ ఒకేలాంటి గైడ్‌లైన్స్ ఇవ్వలేం. ఒక్కొక్కరి లక్షణాలను బట్టి జాగ్రత్తలు సూచించాలి" అని దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో పల్మనాలజిస్ట్ డాక్టర్ దేశ్ దీపక్ చెప్పారు. గత ఏడాది అనుభవాల ఆధారంగా తీవ్ర లక్షణాలతో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులకు పూర్తిగా నయం కావడానికి మూడు నెలలు పట్టవచ్చని ఆయన తెలిపారు. వీరు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. వీలైనంత ఎక్కువసేపు పడుకునే ఉండడం మంచిది. పొద్దున్న లేచిన తరువాత ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేస్తే ఫలితం ఉంటుంది.
"ఇలాంటివారికి మానసికంగా, సామాజికంగా మద్దతు ఇస్తూ సహాయ సహకారాలు అందించడం అవసరం. ముఖ్యంగా వృద్ధులకు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి, ఆక్సిజన్ చెక్ చేస్తూ ఉండడం, సమయానికి మందులు అందించడం... ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ వారు మానసికంగా కూడా కుంగిపోయి ఉంటారు కాబట్టి ఇవి కూడా చేసుకోలేరు. కుటుంబం, స్నేహితులు, పొరుగువారు వారికి పూర్తి సహకరించాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులకు చూపించాలి. పాజిటివ్‌గా ఆలోచించడం ముఖ్యం" అని డాక్టర్ దేశ్ దీపక్ సూచించారు.
కోలుకున్నవారు మరికొన్నాళ్లు ఇంట్లోనే ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉండాలని, ఆక్సిజన్ సపోర్ట్ తగ్గించడంపై వారి డాక్టర్ల సలహా తీసుకోవాలని, సొంత నిర్ణయాలు పనికిరావని డాక్టర్ దేశ్ దీపక్ సలహా ఇస్తున్నారు. మధ్యస్థం లేదా తీవ్ర లక్షణాలతో కోలుకున్నవారందరికీ తరువాత కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పలేం. కొందరికే రావొచ్చు అని డాక్టర్లు అంటున్నారు. కొందరికి ఊపిరితిత్తుల సంకోచం, గుండెజబ్బులు రావొచ్చు. వీటికి రోగిని బట్టి చికిత్స అందించాలని డాక్టర్ దేశ్ దీపక్ చెప్పారు.
తీవ్ర లక్షణాలతో ఆస్పతిలో చికిత్స పొంది ఇంటికి తిరిగివచ్చిన వారికి ఫాలో-అప్ చికిత్స, తక్కువ మోతాదులో బ్లడ్ థిన్నర్స్ వాడడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరిలో జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. బ్లడ్ థిన్నర్స్, ఫాలో-అప్ చెకప్‌ల గురించి వైద్యుల సలహా పాటించాలని డాక్టర్ దేశ్ దీపక్ తెలిపారు. పోస్ట్-కోవిడ్‌లో కొందరిలో కండరాల బలహీనత అధికంగా ఉంటోందని తేలింది. అలాంటివారు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
అలాగే, కోవిడ్ చికిత్సలో తీసుకున్న మందుల వలన కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇప్పుడిప్పుడే తెర పైకి వస్తున్నాయి. అందుకే కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా శరీరంలో వచ్చే మార్పులను గమనించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, డాక్టర్ సలహా మేరకు పరీక్షలు చేయించుకోవడం అవసరం.