సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

బిబిసి

సోమవారం, 18 నవంబరు 2024 (23:06 IST)
ఇంటర్నెట్ ఉపయోగించి కంప్యూటర్, ఫోన్‌లలో చేసే నేరాలను సైబర్ క్రైమ్స్ అంటున్నారు. వీటిల్లో ఆర్థిక నేరాలు, కాపీరైట్ ఉల్లంఘన, హ్యాకింగ్, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి దేశ వ్యతిరేక నేరాలతో పాటు వ్యక్తులను వేధించే నేరాలను కూడా గుర్తించారు. సైబర్ స్టాకింగ్, అవమానపరచడం, బెదిరించడం, వేధించడం వంటివి ఇందులోకి వస్తాయి. దాదాపు 24 రకాల సైబర్ నేరాలు ఇందులో ఉంటాయి.
 
“సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టడం, అసభ్యంగా మాట్లాడడం, సున్నితమైన, ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన మాటలు, ఫోటోలు, వీడియోలు ఇతరులకు పంపడం, ఒకరి పేరుతో మరొకరు అకౌంట్ నిర్వహించడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, దొంగిలించడం, పరువుకు భంగం కలిగించడం, ఇరు వర్గాల మధ్య గొడవలు ప్రేరేపించేలా సందేశాలు ఫార్వార్డ్ చేయడం, మనోభావాలు దెబ్బతీయడం లాంటివన్నీ, నేరాలుగా పరిగణించి పోలీసులు కేసులు పెట్టవచ్చు” అని బీబీసీతో చెప్పారు న్యాయవాది శ్రీనివాస్.
 
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
వాట్సాప్ పోస్టు ఫార్వార్డ్ చేసినా..
‘‘వాట్సప్‌లో ఫార్వార్డ్ చేసే వాటికి కూడా ఇది వర్తిస్తుంది. అంతే కాదు, ప్రైవసీ ఉల్లంఘన కూడా సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది’’ అని చెప్పారు శ్రీనివాస్. 
“మెసేజ్ చివర్లో ‘ఫార్వార్డెడ్ యాజ్ రిసీవ్డ్’ అని పెట్టడం, లేదా వివాదాస్పద మెసేజ్ పెట్టేసి ‘ఈజ్ దిస్ ట్రూ’ అని పెట్టడం వంటివి చేయడం వల్ల ఈ కేసుల నుంచి పూర్తిగా తప్పించుకోలేరు. అది కేసును బట్టి ఆధారపడి ఉంటుంది” అన్నారు శ్రీనివాస్. ‘‘తప్పుడు పోస్ట్ పెట్టిన తరువాత డిలీట్ చేసి క్షమాపణ చెప్పినా కూడా ఉపయోగం లేదని స్వయంగా సుప్రీం కోర్టు, తమిళనాడుకు సంబంధించిన ఒక కేసులో 2023లో చెప్పింది.
 
తమిళనాడుకు చెందిన ఒక నటుడు మహిళలను కించపరిచే పోస్టు పెట్టి తరువాత తీసేసి, క్షమాపణ కూడా చెప్పాడు. అయినా ఆయనపై కేసు నడిచింది. ఆ సందర్భంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. అదే కేసులో మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది. అది అర్థం అయితే మనకు సులువుగా ఉంటుంది. ‘‘సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టు విల్లు నుంచి బాణం వదలడం లాంటింది. మీరు పోస్ట్ చేయనంత కాలం ఏ ప్రమాదం లేదు. కానీ ఒకసారి బాణం వదిలిన తరువాత అది ఎటు వెళ్లినా, ఎంత నష్టం చేసినా దానికి మీరే బాధ్యత వహించాలి. నష్టం జరిగాక క్షమాపణతో సరిపుచ్చలేరు అని మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది’’ అని శ్రీనివాస్ వివరించారు.
 
కఠినంగా సైబర్ చట్టాలు
భారత్‌లో సైబర్ నేరాలన్నింటినీ 2000వ సంవత్సరం నాటి ఐటీ యాక్ట్ ప్రకారం విచారించి శిక్షిస్తారు. ఆ తర్వాత 2008, 2023లలో ఈ చట్టానికి సవరణలు చేయడంతో పాటు, ‘ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ చట్టం 2023 కూడా అమల్లోకి వచ్చింది. ‘‘గతంలోని ఐపీసీ, తాజా న్యాయ సంహితల్లో కూడా అనేక సెక్షన్ల ఆధారంగా ఐటీ-సైబర్ పరమైన కేసులు పెట్టవచ్చు. అది నేర సరళిని బట్టి, పోస్టు తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 65 నుంచి 78 వరకు నేరాల గురించి సవివరంగా ఉంది’’ అని బీబీసీతో అన్నారు శ్రీనివాస్.
 
ఎవరికి ఫిర్యాదు చేయాలి?
సోషల్ మీడియా, ఫోన్, కంప్యూటర్ లేదా మరేదైనా నెట్‌వర్క్-కమ్యూనికేషన్ వస్తువు ద్వారా మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నా, బాధిస్తున్నా ఎలా ఫిర్యాదు చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కొన్ని సందర్భాల్లో పోలీసులు సుమోటోగా కూడా సైబర్ నేరాలను నమోదు చేసుకోవచ్చు. ఏదైనా ప్లాట్‌ఫామ్ వేదికగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, ఉదాహరణకు ఫేస్‌బుక్ వేదికగా జరిగితే, సంబంధిత ప్లాట్‌ఫామ్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
 
రెండో దశలో మీరు పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రాష్ట్రాల వారీగా సైబర్ క్రైమ్ విభాగాలు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఫిర్యాదు చేసేలా భారత్ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది. మీరు దేశంలో ఎక్కడి నుంచి ఫిర్యాదు చేసినా, ఆ ఫిర్యాదు సంబంధిత రాష్ట్రాల పోలీసులకు చేరుతుంది. cybercrime.gov.in వెబ్ సైట్‌లో ‘రిజిస్టర్ ఎ కంప్లైంట్’ ట్యాబ్ కింద ఫిర్యాదు చేయడం. హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి నేరుగా కాల్ చేసి ఫిర్యాదు చేయడం. ఈ నంబర్ 24 గంటలూ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది.
 
ఏవీ ఇబ్బందికర పోస్టులు?
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ కింది పోస్టులను ఇబ్బందిపెట్టేవిగా పరిగణిస్తున్నారు.
పరువుకు భంగం, అశ్లీలత, పోర్న్, పీడోఫిలిక్, ప్రైవసీ భంగం, బాడీ ప్రైవసీకి భంగం కలిగించినా, జెండర్, రేస్, ఎత్నిక్, అభ్యంతరకర, మనీ లాండరింగ్, గ్యాంబ్లింగ్, ఇతరత్రా చట్టవ్యతిరేకమైనవి
పిల్లలకు హాని కలిగించేవి
కాపీ రైట్, పేటెంట్ ట్రేడ్ మార్క్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉల్లంఘన
నకిలీ సమాచారం (ఫేక్ న్యూస్) ఇవ్వడం
ఇతరులను అనుకరించడం (ఇంపర్సనేట్)
భారత సార్వభౌమత్వం, సమగ్రత దెబ్బతీసేలా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే, దేశ రక్షణకు భంగం కలిగించే (డిఫెన్స్ ఆఫ్ ఇండియా), దేశ భద్రతకు భంగం కలిగించే (సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్), విదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించే, శాంతి భద్రతలు దెబ్బతీసే (పబ్లిక్ ఆర్డర్), రెచ్చగొట్టేలా ఉండే పోస్టులను చేయకూడదు. అలాంటి వాటిని తొలగించాలి.
మత విద్వేషాలు రెచ్చగొట్టేవి.
హింసను ప్రేరేపించే విధంగా ఉన్న పోస్టులు కూడా ఈ జాబితాలో ఉంటాయి.
ఇలా సోషల్ మీడియా కేంద్రంగా జరిగే రకరకాల నేరాలపై కేసులు నమోదు చేయడానికి పోలీసులకు హక్కు ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు