అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం

గురువారం, 25 ఆగస్టు 2022 (22:28 IST)
అమెరికాలోని టెక్సస్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరవు మూలంగా ఓ అద్భుతం బయటపడింది. అక్కడ 11.3 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ల పాదముద్రల్ని గుర్తించారు. దాదాపు పూర్తిగా ఎండిపోయిన ఒక నది ఒడ్డున వీటిని నిపుణులు కనుగొన్నారు. భారీగా ఉన్న ఈ అడుగుల గుర్తులు డైనోసార్ల పాదముద్రల్లా ఉన్నాయి. నది ఒడ్డున అనేక పొరలుగా పేరుకుపోయిన బురద అడుగు భాగంలో ఇవి కనిపించాయి. సెంట్రల్ టెక్సస్‌లోని డైనోసర్ వ్యాలీ స్టేట్ పార్క్‌లో వీటిని కనుగొన్నట్లు సూపరింటెండెంట్ జెఫ్ డేవిస్ చెప్పారు. కోట్ల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నారు.

 
అమెరికా కరవు పర్యవేక్షణ సంస్థ ప్రకారం, టెక్సస్ రాష్ట్రం సుదీర్ఘ కాలంగా అనావృష్టి, కరవును ఎదుర్కొంటోంది. కరవును మూడు అత్యంత తీవ్రమైన కేటగిరీలుగా విభజించగా టెక్సస్‌లోని 87 శాతం భూభాగం గత వారం ఈ కేటగిరీల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ కొన్ని చోట్ల అతి తీవ్ర, తీవ్ర, అసాధారణ కరవు పరిస్థితులు ఉన్నాయి. భగభగమండే వేసవి, విపరీతమైన పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా స్టేట్ పార్క్ గుండా ప్రవహించే ఒక నది పూర్తిగా ఎండిపోయింది. దీంతో డైనోసార్ల పాదముద్రలు బయటపడ్డాయి.

 
అక్కడ కనుగొన్న పాదముద్రలు, అక్రోకాంతోసారస్ అనే డైనోసార్ల జాతికి చెందినవని బీబీసీతో డేవిస్ చెప్పారు. అక్కడ మొత్తం 140 పాదముద్రలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాటిలో 60 పాదముద్రలు 30 మీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. అక్రోకాంతోసారస్‌ జాతికి చెందిన డైనోసార్లకు మూడు బొటనవేళ్లు ఉండేవని డేవిస్ చెప్పారు. వాటి ఎత్తు 4.5 మీటర్లు, బరువు దాదాపు 700 కిలోల వరకు ఉండవచ్చని వివరించారు. ఇవి సారోపొసెడాన్ అనే జాతి డైనోసార్లను ఆహారంగా తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ జాతి డైనోసార్ల గుర్తులు కూడా స్టేట్ పార్క్‌లోనే లభ్యమయ్యాయి.

 
సారోపొసెడాన్ డైనోసార్లు 18 మీటర్లు పొడవు ఉంటాయి. వాటికి పొడవైన మెడ ఉంటుంది. పూర్తిగా పెరిగిన సారోపొసెడాన్ డైనోసార్లు 44 టన్నుల బరువు ఉంటాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కారణంగా అమెరికాలో మరో ఆశ్చర్యకర ఘటన కూడా జరిగింది. నెవాడాలోని లేక్ మీడ్ వద్ద రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోవడంతో అందులో ఉన్న మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఈ రిజర్వాయర్ దేశంలోనే అతిపెద్దది.

 
యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి అవశేషాలు, నీటి అడుగున పురాతన పట్టణాలు బయల్పడ్డాయి. పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1.2డిగ్రీ సెంటిగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచ దేశాలన్నీ ఉద్గారాలను తగ్గించకపోతే ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు