నిఖత్ జరీన్: చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్... వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

శుక్రవారం, 20 మే 2022 (07:42 IST)
నిఖత్ జరీన్-ఫోటో కర్టెసి, ట్విట్టర్
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో ఆమె వరల్డ్ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ సృష్టించింది. టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌‌లో ఆమె స్వర్ణం సాధించింది.

 
52 కేజీల విభాగం (ఫ్లై వెయిట్)లో గురువారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5-0తో జిట్‌పోంగ్ జుటామస్(థాయ్‌లాండ్)పై గెలిచింది. అంతకుముందు సెమీస్ పోటీల్లో నిఖత్ 5-0తో కరోలిన్ డి అల్మీడా (బ్రెజిల్)పై గెలుపొందగా... జిట్‌పోంగ్ 4-1తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత జైనా షెకర్‌బెకోవా (కజకిస్తాన్)ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

 
ఫైనల్ చేరిందిలా...
ఈ టోర్నీ తొలిరౌండ్‌లో నిఖత్ 5-0తో హెరీరా అల్వారెజ్ ఫాతిమా (మెక్సికో)పై గెలిచింది. రెండో రౌండ్‌లో 5-0తో లట్సాఖాన్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్‌ఫైనల్లో కూడా 5-0తో చార్లీ సియాన్ డేవిసన్ (ఇంగ్లండ్)పై నెగ్గి సెమీస్‌లో అడుగు పెట్టింది. సెమీఫైనల్లో 5-0తో కరోలిన్‌ను ఓడించి స్వర్ణపతక పోరుకు అర్హత సాధించింది.

 
జూనియర్ వరల్డ్ చాంపియన్ కూడా..
25 ఏళ్ల నిఖత్ జరీన్ నిజామాబాద్‌కు చెందినవారు. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో సత్తా చాటుతోన్న నిఖత్... జూనియర్ కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. 2011లో టర్కీలోనే జరిగిన జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో తలపడిన ఆమె పసిడి పతకాన్ని నెగ్గి వరల్డ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ నుంచి ఇప్పటివరకు మేరీకోమ్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలవగా... సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ మహిళా ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. తాజాగా ఈ జాబితాలో నిఖత్ కూడా చోటు దక్కించుకుంది.

 
తండ్రి ప్రోత్సాహంతో....
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ తన కుమార్తెను బాక్సింగ్‌లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటూ శిక్షణ ఇచ్చారు. తరువాత 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందింది.

 
అప్పటి నుంచీ ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతూ వచ్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీమ్‌కి ఎంపిక అయింది. అడిడాస్‌కు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. 2014లో అప్పటి నిజామాబాద్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, నిఖత్‌ను నిజామాబాద్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు.

 
2011లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడం ఆమె కెరీర్‌లో తొలి పెద్ద అడుగు. ఆ తర్వాత నుంచి ఆమె ప్రదర్శన మెరుగు అవుతూనే వచ్చింది. మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ముందు ఫిబ్రవరిలో జరిగిన 73వ స్ట్రాండ్‌జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంటు సెమీస్‌లో టోక్యో ఒలంపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ బూస్ నాజ్ ని ఓడించింది. ఆ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది.

 
నిఖత్ సాధించిన పతకాలు
2011: జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
2018: బెల్‌గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి
2018: హరియాణాలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం
2019: ఇండియా ఓపెన్‌లో కాంస్యం
2019: ఆసియా చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)‌లో రజతం
2019: థాయ్‌లాండ్ ఓపెన్‌లో రజతం
2019: 70వ ఎడిషన్ స్ట్రాండ్‌జా బాక్సింగ్ టోర్నమెంట్‌ (బల్గేరియా)లో స్వర్ణం
2021: ఇస్తాంబుల్ టోర్నమెంట్‌లో కాంస్యం
2022: 73వ ఎడిషన్ స్ట్రాండ్‌జా బాక్సింగ్ టోర్నీ (బల్గేరియా) లో స్వర్ణం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు