భారత్ - చైనా సరిహద్దులో ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేసే రహస్య దళం: స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:37 IST)
లద్దాఖ్‌లో పాంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్‌) వికాస్ రెజిమెంట్ కంపెనీ లీడర్ నీమా తెంజిన్ శనివారం రాత్రి మరణించారు. మంగళవారం నాడు నీమా తెంజిన్ భౌతికకాయాన్ని లేహ్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చోగ్లాంసార్ గ్రామానికి తీసుకు వచ్చారు.

 
టిబెట్ బౌద్ధ సాంప్రదాయాలను అనుసరించి ఆయన అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టిబెటన్ ఇన్ ఎక్సైల్ సభ్యులు నాండోల్ లాగయారీ తెలిపారు. ప్రస్తుతం చైనా భూభాగంలో ఉన్న టిబెట్‌కు చెందిన నీమా తెంజిన్, రెండు రోజులకు ముందు పాంగోంగ్ సరస్సు వద్ద చైనా పీపూల్స్ లిబరేషన్ ఆర్మీకి, భారత సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారని నాండోల్ లాగయరీ తెలిపారు.

 
శనివారం జరిగిన సంఘటనలో ఎస్ఎఫ్ఎఫ్‌కు చెందిన మరో సైనికుడు కూడా గాయాలు పాలయ్యారని సమాచారం. కానీ భారత సైన్యం ఈ అంశంలో ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే, ఆగస్ట్ 31న భారత సైన్యం చేసిన ప్రకటనలో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిందని మాత్రం చెప్పింది.

 
భారత సైన్యం ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ చేసిన ప్రకటనలో పాంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున చైనా సైన్యం కవ్వింపు చరలకు పాలపడిందనీ, దాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకుందని తెలిపారు.

 
అసలు ఎస్ఎఫ్ఎఫ్ అంటే ఏంటి?
భారత ఆర్మీ మాజీ కల్నల్, రక్షణ వ్యవహారాల నిపుణుడు అజయ్ శుక్లా తన బ్లాగులో.. వికాస్ రెజిమెంట్ కంపెనీ లీడర్ నీమా తెంజిన్ గురించి, ఎస్ఎఫ్ఎఫ్ గురించి ప్రస్తావించారు. అయితే, నీమా తెంజిన్ భౌతిక కాయాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తూ, ఈ సంఘటనను రహస్యంగా ఉంచాలని సూచించారు.

 
1962లో ఏర్పడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ వాస్తవానికి భారత సైన్యంలో భాగం కాదు. ఇది భారత ఇంటెలిజెన్స్ ఏజన్సీ.. రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ)లో భాగం. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన ఒక కథనం ప్రకరం ఈ సంస్థ కార్యకలాపాలను చాలా రహస్యంగా ఉంచుతారు. బహుశా భారత సైన్యానికి కూడా తెలియకపోవచ్చు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా వీరు ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేస్తారు. అందుకే వీరు చేసే పనులు సామాన్య ప్రజలకు తెలియవు.

 
ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థాపక అధ్యక్షుడు భోలానాథ్ మల్లిక్, అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ సలహాలమేరకు హిమాలయా సరిహద్దు ప్రాంతాల్లో చైనీయులతో తలపడగలిగే టిబెటన్ గెరిల్లా బృందాన్ని తయారుచేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచన చేశారు. యుద్ధ సమయంలో చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు నిర్వహించాలనే లక్ష్యంతో మొదలైన ఎస్ఎఫ్ఎఫ్‌కు మొట్టమొదటి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా మాజీ మేజర్ జనరల్ సుజాన్ సింగ్ ఉబాన్ వ్యవహరించారు.

 
సుజాన్ సింగ్ ఉబాన్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ భారత సైన్యం తరపున '22 మౌంటెన్ రెజిమెంట్' కమాండర్‌గా ఉన్నారు. అందువల్ల ఎస్ఎఫ్ఎఫ్‌ను 'ఎస్టాబ్లిష్మెంట్ 22' అని కూడా పిలుస్తారు.

 
అనేక ఆపరేషన్లు...
లద్దాఖ్, సిక్కిం తదితర ప్రాంతాల్లో టిబెటన్ మూలవాసులు చాలాకాలంగా ఆధునిక భారత సైన్యంలో భాగంగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో భాగమైన ఎస్ఎఫ్ఎఫ్ ఇప్పుడు ఆర్ఏడబ్ల్యూ (రా) ఆధీనంలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్‌లోని చక్రాతాలో ఉంది.

 
అమెరికా, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల వద్ద శిక్షణ పొందిన ఎస్ఎఫ్ఎఫ్ దళం.. బంగ్లాదేశ్‌తో యుద్ధం, కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ బ్లూ స్టార్‌తో సహా అనేక సైనిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని సమాచారం. 1950లలో టిబెట్‌పై చైనా దాడిని అడ్డుకున్న ఖంపా తిరుగుబాటుదారుల వారసులు ఎస్ఎఫ్ఎఫ్‌లో సభ్యులుగా ఉన్నారని అంటారు.

 
1959లో చైనా, టిబెట్‌ను ఆక్రమించుకున్న తరువాత బౌద్ధ మత గురువు దలైలామాతో సహా అనేకమంది టిబెటన్లు భారతదేశానికి పారిపోయి వచ్చారు. వీరంతా దిల్లీ, హిమాచల్ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. వీరిలో నీమా తెంజిన్, తెంజిన్ లండెన్ లాంటి అనేకులు ఎస్ఎఫ్ఎఫ్‌లో భాగమయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు