వేసవి కాలం: తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం? తేమ ఉష్ణోగ్రతలు ఎవరికి ప్రాణాంతకం?

మంగళవారం, 26 మే 2020 (13:51 IST)
2070 నాటికి భూమిపై దాదాపు నివసించలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ, సైన్స్ అడ్వాన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం.. ఇలాంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని హెచ్చరిస్తూ కొన్ని విషయాలను వెల్లడించింది.

 
వేసవి, తేమ ఒకేసారి ఉన్న ప్రమాదకర పరిస్థితులు కూడా ఉన్నాయని, అది మొత్తం ప్రపంచమంతా జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఈ అధ్యయనం రచయిత చెప్పారు. అయితే, ఈ పరిస్థితి కొన్ని గంటలపాటే ఉంటుంది. కానీ, ఇప్పుడు అది సంభవించే సంఖ్య, దాని తీవ్రత పెరుగుతూ పోతోంది. ఈ శాస్త్రవేత్తలు 1980 నుంచి 2019 మధ్య వాతావరణ సమాచారం అందించే 7877 వేరు వేరు కేంద్రాల్లో గంటగంటకూ నమోదైన డేటాను విశ్లేషించారు.

 
ఆ విశ్లేషణలో కొన్ని ఉప-ఉష్ణమండల తీర ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, తేమ(Humid) కలిసిన వాతావరణం తరచూ రెట్టింపు అవుతోందని తేలింది. అలా ఎండ వేడి, తేమ కలిసిన ప్రతిసారీ, అది సుదీర్ఘ కాలం పాటు చాలా ప్రమాదకరం అని నిరూపితం కావచ్చు.

 
ఈ ఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి?
ఇలాంటి ఘటనలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వాయవ్య ఆస్ట్రేలియా, ఎర్ర సముద్రం తీర ప్రాంతాలు, కాలిఫోర్నియా లోయల్లో వరుసగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన గణాంకాలు సౌదీ అరేబియాలోని దమాన్‌, దోహా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రస్ అల్ ఖైమా నగరాల్లో 14 సార్లు నమోదైంది. ఈ నగరాల్లో 20 లక్షల మంది నివసిస్తున్నారు.

 
ఆగ్నేయాసియా, దక్షణ చైనా, ఉప-ఉష్ణమండల ఆఫ్రికా, కరిబియన్ ప్రాంతాలు కూడా దీనివల్ల ప్రభావితం అయ్యాయి. ఆగ్నేయ అమెరికాలో చాలా తీవ్రమైన పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా గల్ఫ్ కోస్ట్ దగ్గర తూర్పు టెక్సాస్, లూసియానా, మిసిసిపి, అలబామా, ఫ్లోరిడా పెన్‌హెండల్‌లో కూడా కనిపించింది. న్యూ ఆర్లీన్స్, బిలోక్సీ నగరంలో దీని ప్రభావం దారుణంగా ఉంది.

 
ఎంత ఉష్ణోగ్రత ప్రాణానికి ప్రమాదం?
ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ వాతావరణ కేంద్రాలు రెండు థర్మామీటర్ల ద్వారా ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి. వీటిలో ఒకటి డ్రై బల్బ్ పరికరం. దీనితో గాలిలో ఉష్ణోగ్రతను గుర్తించవచ్చు. మీరు టీవీలో చూసే ఉష్ణోగ్రత వివరాలను ఈ గణాంకాల ద్వారానే సేకరిస్తారు. ఇక రెండోది వెట్ బల్బ్ థర్మామీటర్. ఈ పరికరం గాలిలో తేమను రికార్డ్ చేస్తుంది.

 
దీనిలో ఒక థర్మామీటర్‌ను గుడ్డలో చుట్టి ఉష్ణోగ్రత తీసుకుంటారు. సాధారణంగా ఈ ఉష్ణోగ్రత బయట గాలిలో ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. అధిక తేమతో కూడిన వేడి మనుషులకు ప్రాణాంతకం కావచ్చు. దానివల్ల వెట్ బల్బ్ నుంచి తీసిన రీడింగును ‘ఫీల్స్ లైక్’ అని చెబుతారు. దీని రీడింగ్ చాలా కీలకం.

 
మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రకరకాల ఉష్ణోగ్రతలు మనకు చెమటలు పట్టేలా చేసి శరీరం చల్లబడ్డానికి సాయం చేస్తాయి. శరీరం నుంచి బయటికొచ్చిన చెమట ఆవిరి అయిపోతూ తనతో వేడిని కూడా తీసుకెళ్తుంది. ఈ ప్రక్రియ ఎడారి ప్రాంతాల్లో పక్కాగా జరుగుతుంది. కానీ తేమ ఉన్న చోట అది సరిగా జరగదు. ఎందుకంటే గాలిలో అంతకు ముందే తేమ ఉండడంతో, మన చెమట ఆవిరి కాదు.

 
దాంతో గాల్లో తేమ పెరిగితే, వెట్ బల్బ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు అంతకంటే ఎక్కువకు చేరితే చెమటలు ఆవిరయ్యే ప్రక్రియ మందగిస్తుంది. దానివల్ల వేడిని తట్టుకునే మన సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోవడం కూడా జరగవచ్చు. అలాంటప్పుడు ఎవరైనా ఏసీ గదిలో ఉండాల్సుంటుంది. ఎందుకంటే శరీర అంతర్గత ఉష్ణోగ్రత ఆ వేడిని తట్టుకోగల స్థాయిని దాటేస్తుంది. దాంతో శరీర అవయవాలు పనిచేయకుండా పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా దాదాపు ఆరు గంటల్లో చనిపోవచ్చు.

 
తరచూ పెరిగే తేమ శాతం
ఇప్పటివరకూ అత్యంత అరుదుగా వెట్ బల్బ్ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలసెల్సియస్ దాటాయని భావించారు. కానీ, 2015లో ఇరాన్‌లోని బందార్ నగరంలో వెట్ బల్బ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దగ్గరకు చేరుకోవడాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు గమనించారు. ఆ సమయంలో గాలిలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ ఉంది. కానీ ఈ కొత్త అధ్యయనం తర్వాత పర్షియన్ గల్ఫ్ నగరాల్లో ఒకటి నుంచి రెండు గంటల్లో వెట్ బల్బ్ టెంపరేచర్ పది సార్లకు పైనే 35 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్లిందని తెలిసింది.

 
కొలంబియా యూనివర్సిటీలో లెమాంట్ డోహర్టీ ఎర్త్ అబ్జర్వేటరీలో పరిశోధకులు ఈ అధ్యయనంలో ప్రముఖ రచయిత కాలిన్ రేమండ్ “పర్షియన్ గల్ఫ్‌లో తేమ నిండిన వేడి ఉండడానికి కారణం ప్రధానంగా తేమ. కానీ అలాంటి స్థితి ఏర్పడడానికి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండాలి. మేం అధ్యయనం చేస్తున్న గణాంకాలు ఇప్పటికీ చాలా అరుదుగానే వస్తున్నాయి. కానీ 2000 తర్వాత అవి చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి’’ అని చెప్పారు.

 
ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై జరిగిన అధ్యయనాలన్నీ ఇలాంటి సీరియస్ ఘటనలను నమోదు చేయడంలో విఫలమయ్యాయి. ఎందుకంటే పరిశోధకులు సాధారణంగా పెద్ద ప్రాంతంలో, దీర్ఘకాల అవధిలో వేడి, తేమ శాతం చూస్తుంటారు. కానీ కాలిన్ రెమండ్, ఆయన సహచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాలపై పరిశోధనలు చేయడంతో, చిన్న ప్రాంతాల్లో, చాలా తక్కువ అవధిలో ఆ పరిస్థితి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోగలిగారు.

 
“మా అధ్యయనం గత అధ్యయనాలతో పూర్తిగా ఏకీభవించింది. ఒక మెట్రోపాలిటన్ ప్రాంతం స్థాయిలో 35 డిగ్రీల సెల్సియస్ వెట్ బల్ప్ ఉష్ణోగ్రత 2100 నాటికి సర్వసాధారణం అయిపోతుంది. మేం ఆ అధ్యయనానికి చిన్న ప్రాంతాల్లో, తక్కువ అవధిలో అలా ఎందుకు జరుగుతుంది? అనేది జోడించాం. అలాంటి పరిస్థితుల్లో హై రిజల్యూషన్ డేటా చాలా అవసరం” అన్నారు.

 
అత్యంత ప్రమాదం ఎవరికి?
ఇలాంటి ఘటనలు ఎక్కువగా తీర ప్రాంతాలు, నీటి పాయలు, జలసంధుల్లో జరుగుతుంటాయి. అక్కడున్న జలాలు ఆవిరై పైకెళ్లి వేడి గాలిలో కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో 2100 నాటికి బతకడానికి సరిపోయే ఉష్ణోగ్రతలు ఉంటాయని ఈ అధ్యయనంలో చెప్పారు. ఇది సముద్రమట్టం అత్యధిక ఉష్ణోగ్రతలు, ఖండాల వేడి కలవడం వల్ల తేమ నిండిన వేడి ఏర్పడవచ్చు.

 
ఏయే ప్రాంతాల ప్రజలపై దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది, ఆ పరిస్థితి ఏర్పడితే మనం ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు చేయవచ్చు అనేది తెలుసుకోడానికి, హై రిజల్యూషన్ డేటా సహకరిస్తుంది. దానివల్ల వారు ఎయిర్ కండిషన్‌లో ఉండడంగానీ, ఇంటి నుంచి బయటకు వెళ్లి పనిచేయడానికి, వేరే దీర్ఘకాలిక చర్యలు చేపట్టడానికి సాయం చేయచ్చు.

 
ఈ అధ్యయనంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రజలు వేడి నుంచి తమను తాము కాపాడుకోలేనంత పేదరికంలో ఉంటారు.

 
ఇదే అధ్యయనంలో మరో రచయిత, శాస్త్రవేత్త రాడ్లే హార్డిన్ “పేద దేశాల్లో ఎయిర్ కండిషన్ విషయం పక్కన పెడితే, అసలు విద్యుత్ సరఫరానే లేనివారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. వీరిలో చాలామంది జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడతారు. ఈ వాస్తవాలన్నీ కొన్ని ప్రాంతాలను నివసించడానికి పనికిరానివిగా మార్చేస్తాయి” అన్నారు.

 
కార్బన్ ఉద్గారాలను ఎప్పటికీ తగ్గించలేకపోతే, ఇలా ఈ ఘటనలు పెరుగుతూనే ఉంటాయి. ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ క్లైమెటాలజిస్ట్ స్టీవెన్ షేర్‌వుడ్ “ఈ అంచనాల వల్ల త్వరలో మనం భూమిపై కొన్ని ప్రాంతాల్లో నివసించడమే కష్టమయ్యేంత వేడి ఉండబోతోంది. మొదట్లో మన దగ్గర చాలా ‘సేఫ్టీ ఆఫ్ మార్జిన్’, అంటే మనం ప్రమాదానికి చాలా దూరంగా ఉన్నామని అనుకునేవారు” అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు