వీజీ సిద్ధార్థ: ఆ సంభాషణే కాఫీ కింగ్‌ను 'కాఫీ డే' వ్యాపారంలోకి నడిపించింది

గురువారం, 1 ఆగస్టు 2019 (17:56 IST)
ప్రఖ్యాత 'కెఫే కాఫీ డే' వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణం భారత వ్యాపార ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగించింది. మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జి సమీపంలో ఆయన మృతదేహాన్ని కొందరు జాలర్లు గుర్తించారు. ఆయన మీడియా దృష్టికి దూరంగా ఉన్నప్పటికీ, ఆయన సృష్టించిన బ్రాండ్ ప్రపంచ ఆర్థిక యవనికపై భారత్ స్థాయి పెరుగుదలకు ఒక ప్రతీకగా నిలిచింది.

 
కర్ణాటకలోని చిక్కమగళూరులో కాఫీ తోటల యజమానుల కుటుంబంలో జన్మించిన సిద్ధార్థ , 1980ల్లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. కొంత కాలానికే స్టాక్ మార్కెట్లలో సొంతంగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. భారత్‌లో 1991 ఆర్థిక సంస్కరణలతో కాఫీ వ్యాపారంపై పరిమితులు తొలగించాక, సిద్ధార్థకు తొలిసారిగా గొప్ప అవకాశం లభించింది. ఇది 1993లో కాఫీ గింజల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దోహదం చేసింది. రెండేళ్లలోనే ఆయన కంపెనీ భారత్‌ నుంచి కాఫీ ఎగుమతిచేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా అవతరించింది.

 
శరవేగంగా వృద్ధి
పాశ్చాత్య దేశాల్లో 'కెఫే సంస్కృతి' నుంచి స్ఫూర్తి పొందిన సిద్ధార్థకు, భారత్‌లో కూడా కాఫీ చైన్ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. టీకి ఎక్కువగా అలవాటుపడ్డ దేశంలో క్యాపచ్చీనోను కోరుకొనేవారు చాలా త్కువ మంది ఉంటారని, కాబట్టి ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సహచరులు సూచించారు. సిద్ధార్థ వెనక్కు తగ్గలేదు. జర్మనీ కాఫీ చైన్ చిబో యజమానులతో ఆయన జరిపిన సంభాషణ తన ఆలోచనను ఆచరణలో పెట్టేలా చేసింది.

 
'ఎ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ కాఫీ' అనే స్లోగన్‌తో 1996లో బెంగళూరులోని ఓ సంపన్న ప్రాంతంలో తొలి 'కెఫే కాఫీ డే' ఔట్‌లెట్‌ను సిద్ధార్థ ప్రారంభించారు. సీసీడీ యువతను వెంటనే విశేషంగా ఆకట్టుకొంది. విద్యార్థులు, 30 ఏళ్లలోపు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు అక్కడ కాఫీ తాగుతూ గంటలకొద్దీ గడిపేవారు. 1990ల్లో, 2000ల్లో సీసీడీలకు ఆదరణ అంతకంతకూ పెరిగిపోయింది. కంపెనీ శరవేగంగా వృద్ధి చెందింది. సీసీడీ తన తొలి అంతర్జాతీయ ఔట్‌లెట్‌ను 2005లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ప్రారంభించింది. 2011 నాటికి వెయ్యికి పైగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది.

 
బెంగళూరుకు చెందిన బ్రాండ్ కన్సల్టంట్ హరీశ్ బిజూర్- సిద్ధార్థను అమెరికాకు చెందిన కాఫీ కంపెనీ 'స్టార్‌బక్స్'కు సుదీర్ఘకాలం సీఈవోగా వ్యవహరించిన హోవర్డ్ షుల్ట్జ్‌తో పోలుస్తారు. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్‌గా స్టార్‌బక్స్‌ను తీర్చిదిద్దడంలో హోవర్డ్ కీలకపాత్ర పోషించారు. "సిద్ధార్థ భారత్‌లో కాఫీ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన నిస్సందేహంగా కాఫీ కింగ్. ఇందులో రెండో మాటకు తావులేదు" అని హరీష్ బిజూర్ బీబీసీతో చెప్పారు.

 
సీసీడీ వ్యాపారం మూడు సూత్రాలు ప్రాతిపదికగా సాగుతోంది. అవేంటంటే- అందుబాటులో ధరలు, మంచి వాతావరణం, నాణ్యమైన సేవలు. వినియోగదారులందరూ ఒకేలా ఉండరు. ఆయా వర్గాల అవసరాలకు తగినట్లుగా భిన్నమైన నమూనాల్లో స్టోర్లను ఏర్పాటు చేస్తూ, సీసీడీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకొంటూ వచ్చారు. కాఫీకి రూ.70 నుంచి రూ.100 మించి పెట్టలేని యువతను సీసీడీ ప్రధాన లక్ష్యంగా చేసుకొంది. అలాగే, అదనపు సేవల కోసం మరింత డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉండే ప్రీమియం వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని లాంజ్-తరహా స్టోర్లను తెరిచింది. వీటిలో వైఫై ఉచితం. పాత రోజుల్లో వైఫై ఇలా ఇవ్వడం అరుదు.

 
"కాఫీతోపాటు ఇంటర్నెట్‌ ఇవ్వడం అప్పట్లో అసాధారణమైన కాంబినేషన్" అని హరీష్ బిజూర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వియన్నా, చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్, మలేషియా రాజధాని కౌలాలంపూర్ సహా 200కి పైగా నగరాల్లో 1,700కు పైగా సీసీడీ స్టోర్లు ఉన్నాయి.

 
కొత్త ప్రత్యర్థులు
దాదాపు ఎలాంటి పోటీ లేకుండా దశాబ్దానికి పైగా వ్యాపారం సాగించిన సీసీడీకి- స్టార్‌బక్స్, కోస్తా కాఫీ, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో తొలిసారిగా 2012లో గట్టి పోటీ ఎదురైంది. తీవ్రమైన పోటీ కారణంగా సీసీడీ తన విస్తరణ వేగాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. 2015లో మరిన్ని నిధుల కోసం- భారత స్టాక్‌మార్కెట్లో కంపెనీని 'లిస్టింగ్' చేయించారు. మదుపర్ల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ట్రేడింగ్ మొదటి రోజే కంపెనీ షేరు ధర 18 శాతం పడిపోయింది.

 
ఆ తర్వాత నష్టాలు తగ్గించుకొనేందుకు లాభదాయకంగా లేని స్టోర్లను సీసీడీ మూసివేయడం మొదలుపెట్టిందని సీసీడీకి సలహాలు ఇచ్చే రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్‌ఎల్‌కు చెందిన శుభ్రాంశు పాని తెలిపారు. పోటీని ఎదుర్కొనేందుకు వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉందని సీసీడీ గుర్తించిందని ఆయన బీబీసీతో చెప్పారు. లాభాల్లేని స్టోర్ల మూసివేత ఫలితాన్నిచ్చింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సీసీడీ లాభాలు ఆర్జించింది.

 
వృద్ధిని వెంటాడిన రుణభారం
కానీ పెరుగుతున్న రుణభారం సంస్థ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉంది. 2019 మార్చి 31లో ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సీసీడీ రుణాలు వంద కోట్ల డాలర్లకు దగ్గరగా ఉన్నాయి. అప్పులు తగ్గించుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది భారత సాఫ్ట్‌వేర్ సంస్థ 'మైండ్‌ట్రీ'లో తన 20.41 శాతం వాటాను 45 కోట్ల డాలర్లకు పైగా విలువకు సిద్ధార్థ అమ్మేశారు.

 
రుణభారాన్ని తగ్గించుకొనేందుకు సీసీడీలో తన వాటాను కొంత అమ్మేసేందుకు కోకాకోలా, ఇతర సంస్థలతో సిద్ధార్థ చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. వీటిని సిద్ధార్థగాని, కోకాకోలాగాని ఎన్నడూ నిర్ధరించలేదు. పెరుగుతున్న అప్పులు సీసీడీ మార్కెట్ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతూ వచ్చాయి. 2018 జనవరిలో సీసీడీ షేరు ధర ముందెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. అప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్ వంద కోట్ల డాలర్లకు పైనే ఉంది. కానీ ఆ తర్వాత షేర్ల విలువ బాగా పడిపోయింది.

 
మంగళవారం సిద్ధార్థ అదృశ్యం వార్తలు వచ్చాక షేరు ధర 35 శాతానికి పైగా పడిపోయింది. సవాళ్లున్నప్పటికీ, సరైన నిర్వహణ ఉంటే గొప్ప భవిష్యత్తున్న మంచి బ్రాండ్ సీసీడీ అని విశ్లేషకులు చెబుతారు. అందువల్లే సిద్ధార్థ మరణం భారత వ్యాపార ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగించింది. అసలు ఏం జరిగిందనేదానిపై కొంత సమాచారం సీసీడీ బోర్డుకు సిద్ధార్థ రాసిన లేఖలో ఉండొచ్చు.

 
శక్తివంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ సరైన లాభదాయక వ్యాపార నమూనాను తాను తీర్చిదిద్దలేకపోయానని తన లేఖలో ఆయన విచారం వ్యక్తంచేశారు. తాను అప్పుల్లో ఉన్నానని, అన్ని పొరపాట్లకూ తానే బాధ్యుడినని, వ్యాపారవేత్తగా విఫలమయ్యానని ఆయన చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ ఒకరు తనను వేధించారని, ఫలితంగా ద్రవ్య లభ్యతలో తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయని సిద్ధార్థ ఆరోపించారు.

 
ఈ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. ఇది సిద్ధార్థదేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇతరులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ మరణం నేపథ్యంలో ఆర్థిక అంశాలపై రాజకీయ దుమారం రేగుతోంది. మరోవైపు సంబంధీకులందరూ తమకు అండగా నిలవగాలని సీసీడీ కోరుతోంది. వ్యాపారం కొనసాగుతుందని భరోసా ఇస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు