భారత ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది ఎందుకు?

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:51 IST)
"భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ చేపేట్టే సమయం ఆసన్నమైంది" అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ బోబ్డే అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల తాత్కాలిక నియామకంపై వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బోబ్డే ఆ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ శరద్ బోబ్డే భారతదేశానికి 47వ ప్రధాన న్యాయమూర్తి. ఆయనకు ముందు ఆ పదవిని చేపట్టిన 46మంది కూడా పురుషులే. ఆయన తరువాత, కాబోయే 48వ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కూడా పురుషుడే.

 
"మహిళల ఆసక్తి, ఉత్సాహం మాకు తెలుసు. సాధ్యమైనంత మేర అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వైఖరిలో మార్పు రావాలి అనడానికేమీ లేదు. సమర్థులైన అభ్యర్ధులు కావాలి" అని బోబ్డే అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టులలో కలిపి కేవలం 11 శాతం మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ఈ సంఘం కోర్టుకు తెలిపింది.

 
"ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉండడం విచారకరం. అయితే, మేం ఈ సమస్య గురించి మాట్లాడడం ఇదేం మొదటిసారి కాదు. 2015లో కూడానేను ధర్మాసనం ముందు ఈ అంశంలో వాదించాను. మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని అప్పట్లో ధర్మాసనం సూచించింది. అయితే, అప్పటినుంచి ఇప్పటి వరకూ కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెద్దగా పెరగలేదు" అని లాయర్ స్నేహ ఖలితా తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంలో పిటిషన్ వేసిన వారిలో ఆమె కూడా ఒకరు.

 
హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న మహిళా న్యాయమూర్తులు ఎంతమంది?
భారతదేశంలో 1950లో సుప్రీం కోర్టు ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటినుంచి 47మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొలిగా ఎపెక్స్ కోర్టులో 8 మంది జడ్జ్‌లు మాత్రమే ఉండేవారు. అయితే, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగం, పార్లమెంటుకు ఇచ్చింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో 1956 నాటికి న్యాయమూర్తుల సంఖ్యను 8 నుంచి 11కు పెంచారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ 1960కి 14, 1978కి 18, 1986కు 26, 2009కి 31, 2019 నాటికి 34 అయింది.

 
అయితే, ఇప్పటివరకూ కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీం కోర్టులో జడ్జ్‌లుగా వ్యవహరించారు . 1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం 34 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమె, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. దేశవ్యాప్తంగా ఉన్న 661 మంది హైకోర్టు జడ్జ్‌లలో కేవలం 73 మంది మాత్రమే మహిళలు. మణిపూర్, మేఘాలయ, పట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.

 
న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య ఎందుకింత తక్కువ ఉంది?
ఇప్పుడు ఈ పిటిషన్ ఎందుకు వేశారని మేము కొందరు పిటిషనర్లను అడిగాం. "ఇప్పటికే ఆలస్యమైంది. మనకు దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి 50-50 ఉంటే న్యాయవ్యవస్థలో కూడా ఈ నిష్పత్తి ప్రతిబింబించాలి. జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఈ సమస్య గురించి ఎప్పుడో పోరాటం జరగాల్సింది. అలా జరిగి ఉంటే ఈపాటికి మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరిగి ఉండేది" అని లాయర్ శోభా గుప్త అన్నారు. ఇది చాలా లోతైన విషయమని రిటైర్డ్ జస్టిస్ సుజాత మనోహర్ అభిప్రాయపడ్డారు. ఆమె, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గానూ, తరువాత, సుప్రీం కోర్టు జడ్జ్‌గానూ వ్యవహరించారు.

 
"ఇదొక విషవలయం. మనకు ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయమూర్తులే చాలా తక్కువ. హైకోర్టు జడ్జ్ అవ్వాలంటే ముందు చాలా ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. హైకోర్టు అయ్యాక సుప్రీం కోర్టు జడ్జ్‌లుగా వెళతారు. అందుకని, హైకోర్టులో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే తప్ప సుప్రీం కోర్టులో పెరగదు. మరోపక్క హైకోర్టు, సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండడం చూసి మహిళా న్యాయవాదులు నిరాశపడుతున్నారు. ఇది ఇలా వలయంలా సాగుతోంది. ఈ వలయాన్ని ఛేదించాలి. హైకోర్టు జడ్జ్ పదవికి అర్హులైన, సమర్థులైన మహిళా న్యాయవాదులు మనకు ఉన్నారు" అని ఆమె అన్నారు.

 
అయితే, "ఎందుకు వాళ్లను జడ్జ్‌లుగా నియమించట్లేదు?" అని శోభ ప్రశ్నిస్తున్నారు. "మనకు ఎక్కువమంది మహిళా లాయర్లు లేరన్నది వాస్తవమే. నేను జాయిన్ అయిననప్పుడు చాలా తక్కువమంది ఉండేవారు. 1997లో 130 మంది మహిళా లాయర్లు మాత్రమే సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. మహిళా లాయర్ల సంఖ్య బాగా పెరిగింది. కానీ, ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళ ప్రాతినిధ్యం మాత్రం పెరగట్లేదు" అని శోభ అన్నారు.

 
"వైఖరి మారలేదు అనుకోవడానికి ఏమీ లేదని" ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. అంటే ఉన్నత న్యాయస్థానంలో ఎక్కువమంది మహిళలు ఉండాలని వారు కోరుకుంటున్నారని అర్థం. అయితే, అలా భావిస్తే సరిపోదు, మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక అవసరమని, మార్పు చేతల్లో కనిపించాలని లాయర్ శోభ అభిప్రాయపడ్డారు.

 
"అవును, నిజమే..మహిళలు కావాలి, రావాలి అని అందరూ అంటారు. కానీ చేతల్లో మాత్రం అది జరగదు. జస్టిస్ ముకుందం శర్మ, జస్టిస్ సంజయ్ కృష్ణ కూడా ఇదే మాట అన్నారు. ఇంతమంది జడ్జ్‌లు మహిళలకు స్థానం ఇవ్వాలని భావిస్తున్నారు. మరెందుకు, మహిళా న్యాయమూర్తుల నియామకం జరగట్లేదు? 20 మంది అభ్యర్థుల పేర్లను హైకోర్టు పంపిస్తే అందులో ఒకరో ఇద్దరో మహిళలు ఉంటారు. కనీసం నలుగురి పేర్లైనా పెట్టాలి కదా. జెండర్ అసమానత్వం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మహిళా న్యాయమూర్తుల సంఖ్య అంత తక్కువగా ఉంది" అని శోభ అన్నారు.

 
కుటుంబ బాధ్యతలు మహిళా న్యాయవాదులకు అడ్డు అవుతున్నాయా?
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బోబ్డే చేసిన ఒక వ్యాఖ్య చాలామందిని చిరాకుపెట్టింది. "హైకోర్టు జడ్జ్‌గా పదవిని స్వీకరించమని చాలామంది మహిళాలను ఆహ్వానించాం. కానీ, వాళ్లంతా ఈ ఆహ్వానాన్ని నిరాకరించారు. ఇంటి బాధ్యతలు ఉన్నాయి, పిల్లవాడు పన్నెండో తరగతి చదువుతున్నాడు.. ఇలాంటి కారణాలు చెప్పి హైకోర్టు జడ్జ్‌గా ఉండడానికి నిరాకరించారని ఒక హైకోర్టు న్యాయమూర్తి నాకు రిపోర్ట్ చేశారు. ఈ విషయాలన్నిటినీ బహిరంగంగా చర్చించలేం" అని జస్టిస్ బోబ్డే అన్నారు. నిజంగా, ఇలాంటి కారణాలతో మహిళలు జడ్జ్ పదవిని నిరాకరిస్తారా?

 
"నేనైతే ఇప్పటివరకూ ఇలాంటి కారణాలు చెప్పి జడ్జ్ పదవిని కాదన్న మహిళా లాయర్లను చూడలేదు. అయితే జస్టిస్ బోబ్డే చెప్తున్నది అబద్దం అని కాదు. ఆయనకు అలాంటివారు ఎదురు పడి ఉండవచ్చు" అని జస్టిస్ మనోహర్ తెలిపారు. కాగా, పురుషులు కూడా ఇలాంటి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జడ్జ్ పదవిని నిరాకరించే అవకాశం ఉందని ఆమె అన్నారు. "అలాంటి కథలు మేం చాలా విన్నాం. అనేకమంది మగ లాయర్లు వ్యక్తిగత కారణాలు చెప్పి జడ్జ్ పదవిని కాదన్నవారు ఉన్నారు. నిజానికి, నేను ఇలాంటివి ఎక్కువగా పురుషుల దగ్గరే విన్నాను. అయినా కూడా, సుప్రీం కోర్టు జడ్జ్‌లుగా మగవారే నియమితులు అవుతున్నారు.

 
20 మంది అభ్యర్థుల్లో ఇద్దరి పేర్లు మాత్రమే సూచించినప్పుడే సమస్య మొదలైనట్టు లెక్క. ఆ ఇద్దరూ వ్యక్తిగత కారణాల వలన జడ్జ్ పదవిని నిరాకరిస్తే, 'మహిళలు నిరాకరించారు' అనేస్తారు. ఆ జాబితాలో 10 మంది మహిళా న్యాయవాదుల పేర్లు చేర్చవచ్చు కదా. అలా ఎందుకు చేయరు? ఏదో ఫార్మాలిటీలాగ మహిళల పేర్లు చేర్చాం అని చెప్పడానికి ఇద్దరిని పెడితే ఎలా? 1950లలో ఇలా జరిగితే, సరేలే అనుకోవచ్చు. కానీ, ఇప్పటికీ అలాగే జరుగుతోంది అంటే మనం ఒక వ్యవస్థగా విఫలమవుతున్నాం అనే అర్థం" అని జస్టిస్ మనోహర్ అభిప్రాయపడ్డారు.

 
న్యాయవ్యవస్థలో మహిళల చరిత్ర
న్యాయవ్యవస్థలో కూడా ముందు సాగడానికి మహిళలు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికీ ప్రజలు వృత్తిని, జెండర్‌ను వేరుగా చూడడం నేర్చుకోలేదని శోభ అన్నారు. "లా ప్రాక్టీస్ చేయడం కోసం మహిళలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. మొదట్లో మహిళలను లా ప్రాక్టీస్ చేయనిచ్చేవారు కాదు. కోర్టులో మహిళలు మరొకరికి ప్రాతినిధ్యం వహించడానికి వీల్లేదు.
1923లో వచ్చిన లీగల్ ప్రాక్టీషనర్ (వుమెన్) యాక్ట్‌తో ఈ పరిస్థితి మారింది. ఎంతో పోరాటం చేసి మహిళలు న్యాయవాద వృత్తిని చేపట్టగలిగే హక్కును సంపాదించుకున్నారు" అని లాయర్ స్నేహ వివరించారు.

 
పురుషులకు మాత్రమే పరిమితమైన న్యాయవద వృత్తిని ఛాలెంజ్ చేసిన తొలితరం మహిళా లాయర్లు రెజినా గుహా, సుధాంశు బాల హజ్రా, కర్నెలియా సోరబ్జీ. రెజీనా గుహ లా చదువు పూర్తి చేసుకుని, 1916లో ప్లీడర్‌గా తన పేరు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పట్లో ఇది చాలా వింత. ఆమె అప్లికేషన్‌ను కలకత్తా హైకోర్టుకు పంపించారు. ఈ కేసును మొట్టమొదటి "పర్సన్ కేస్"గా పరిగణిస్తారు. 1879లో వచ్చిన లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ ప్రకారం "వ్యక్తులు" లా చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు. అయితే ఈ "వ్యక్తులు" కేటగిరీలో మహిళలు లేరు.

 
రెజీనా గుహా ఈ యాక్ట్‌ను సవాలు చేసిన తొలి మహిళ. కానీ, ఆమె పిటీషన్‌ను 5గురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది.1921లో సుధాంశు బాల కూడా ఇదే పోరాటం చేశారు. ఆమె పట్నా హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇది రెండో "పర్సన్ కేసు". అయితే, 1919నాటికే బ్రిటన్ హైకోర్టులు మహిళలు న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చని తీర్పునిచ్చాయి. కాగా, కలకత్తా హైకోర్టు తీర్పును అనుసరిస్తూ పాట్నాహైకోర్టు కూడా సుధాంశు బాల అప్లికేషన్‌ను తిరస్కరించింది. అదే ఏడాది, కార్నెలియా సోరబ్జీ అలహాబాద్ కోర్టులో పిటీషన్ వేసి గెలిచారు. అలా, సోరబ్జీ భారతదేశ మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా చరిత్రకెక్కారు. తరువాత, 1923లో లీగల్ ప్రాక్టిషనర్స్ యాక్ట్ రావడంతో కలకత్తా, పాట్నా హైకోర్టులు ఇచ్చిన తీర్పులు రద్దు అయ్యాయి. ఈ యాక్ట్ మహిళలకు న్యాయవాద వృత్తిని చేపట్టే అవకాశాన్ని కల్పించింది.

 
ఉన్నత న్యా వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం ఎందుకు పెరగాలి?
"అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఎక్కువమంది మహిళలను జడ్జ్‌లుగా నియమించాలన్న దానికి కారణాలు ఎందుకు చెందుకు చెప్పాలి? వ్యవస్థలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు కోర్టుల్లో ఉండొద్దా? ఈ కారణం సరిపోదా? మహిళా న్యాయవాదులకు సహానుభూతి ఎక్కువగా ఉంటుంది, వాళ్లు మెరుగైన తీర్పులు అందిస్తారని కాదు. అలాంటివి నేను ఆమోదించను. ఇప్పటివరకు కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించారు. మిగతావారంతా పురుషులే. అంటే ఇప్పటివరకు సుప్రీం కోర్టు మంచి తీర్పులు, ముఖ్యంగా మహిళల విషయంలో మెరుగైన తీర్పులు ఇవ్వలేదా? అది కాదు సమస్య.

 
అదే కాకుండా, సుప్రీం కోర్టులో ఎవరు ఏ కేసులో జడ్జ్‌గా వ్యవహరిస్తారన్నది ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. మహిళల కేసుల్లో మహిళా న్యాయంమూర్తులే ఉంటారని చెప్పలేం" అని శోభ వివరించారు. అయితే, ఎక్కువమంది మహిళా న్యాయమూర్తులు ఉండడం నైతికంగా మహిళా లాయర్లకు మద్దుతు ఇస్తుందని జస్టిస్ మనోహర్ అభిప్రాయపడ్డారు. లాయర్ స్నేహ కూడా ఇదే వెలిబుచ్చారు.

 
"కోర్టుల్లో జెండర్ సమానత్వం గురించి మాట్లాడతారు. ఇంట్లో పని చేసే భార్యలకు జీతాలు ఇవ్వాలని, శబరిమలకు మహిళలకు అనిమతించాలని తీర్పులు వెలువరించారు. కానీ, న్యాయవ్యవస్థ పదవుల్లో ఎంత సమానత్వం ఉందన్నది చూసుకోవాలి . ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మార్పులు రావాలి" అని స్నేహ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు