త్రిభుజాకారంలో ఉండే "మేర్" అనే కొండపైన త్రిభుజాకారంలోనే సుమారు మూడు వందల అడుగుల ఎత్తులో... 5 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా రూపుదిద్దుకున్నదే జైసల్మేర్ కోట. రాజస్థాన్‌లో నెలవైన ఈ జైసల్మేర్ కోటను... క్రీ.శ. 1156లో "భాటి వంశం" రాజైన "జైసల్ దేవ్‌జీ" నిర్మించాడు. రాజప్రసాదంలో పనిచేసే సిబ్బంది కూడా కోటలోనే ఉండేందుకు వీలుగా ఈ కోటను నిర్మించారు.
రాజులు పోయినా అప్పటి రాజ సేవిక కుటుంబాల వారసులైన ఐదువేల మందితో ఈ జైసల్మేర్ కోట ఇప్పటికీ కళకళలాడుతూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. కోటలోని జైన మందిరాల శిల్పకళ ఎలాంటివారినైనా మంత్రముగ్ధులను చేస్తుంది. కోట మొత్తం కలియదిరిగితే అప్పటి రాజుల జీవనశైలి అర్థమవుతుంది. ఇక కోట నిర్మాణ నాణ్యత విషయమైతే చెప్పాల్సిన పనేలేదు.
జైసల్మేర్ నగరమంతా అందమైన హవేలీలలో అలరారుతూ ఉంటుంది. ఇక్కడి ఏ కట్టడమైనా స్థానికంగా దొరికే పసుపుపచ్చని రాయితో కట్టడం వల్ల నగరమంతా ఎండలో ఉండే బంగారంలాగా మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని "గోల్డెన్ సిటీ" అని పిలుస్తుంటారు. ఈ పట్టణం 35 కిలోమీటర్ల చుట్టుకొలతతో విస్తరించి ఉంటుంది. అక్కడి ప్రభుత్వం కూడా టూరిస్టులను ఆకర్షించే అనేక కార్యక్రమాలను కూడా చేపడుతోంది.
జైసల్మేర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో "కుల్దర్" అనే ప్రాంతం ఉంటుంది. దీనికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... మనుషులు లేని ప్రాంతం. దీనికో కారణం కూడా ఉంది. వందల ఏళ్ల క్రితం ఆ చుట్టుప్రక్కల 84 గ్రామాలలో ఒకే కులం ఉండేవారట. ఆ ఊర్లోని ఓ అందమైన అమ్మాయిని జైసల్మేర్ రాజ్య సైన్యాధికారి సాలమ్ సింగ్ ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని కబురు పెట్టాడు.
అయితే కట్టుబాట్లకు ఎక్కువగా విలువనిచ్చే ఆ కులంవారు దానికి ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించిన ఆ సైన్యాధికారి నెలరోజుల వ్యవధి ఇచ్చి ఆ లోపు పెళ్లి చేయకపోతే బలవంతంగా పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ ఊరి పెద్దలందరూ ఆలోచించి గడువుకు ముందుగానే పిల్లాపాపలతో, తట్టాబుట్టా సర్దుకుని 84 ఊర్లూ ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. తరువాత ఎంతవెదికినా వారు కనిపించలేదట.
అలాగే.. "సామ్" ఇసుక దిబ్బలు మనదేశ పర్యాటకులతోపాటు, విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఇసుక దిబ్బలపైకి ఎక్కి సూర్యాస్తమయం చూసేందుకు రెండు కన్నులూ చాలవనే చెప్పవచ్చు. అంత అందమైన దృశ్యాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండము.
అలాగే... రాజస్థాన్‌లోని థార్ ఎడారి అంచున వెలసిన రెండో పట్టణం జోధ్‌పూర్. క్రీ.శ. 1459లో రాథోడ్ వంశ రాజైన రావ్ జోధాజీ నిర్మించిన నగరం కాబట్టి ఆయనపేరుమీదే అది స్థిరపడిపోయింది. ఈ జోధ్‌పూర్‌లో చూడదగ్గది మెహర్ ఘర్ కోట. 125 మీటర్ల ఎత్తుమీద నిర్మించిన ఈ కోటలోపలి నగిషీలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లోని ఎక్కువ భాగాన్ని స్టార్ హోటల్‌కు లీజుకు ఇవ్వగా... మిగతా భాగాన్ని రాజులకు చెందిన వస్తు ప్రదర్శన శాలగా వాడుతున్నారు.
ఎలా వెళ్ళాలంటే... సికింద్రాబాదు నుంచి అహమ్మదాబాద్ వరకూ రైల్లో... అక్కడ్నించి జైసల్మేర్ వరకూ బస్సుల్లోనూ వెళ్లవచ్చు. అలాగే ఆటోలు, టాక్సీలు బోలెడన్ని ఉంటాయి. అక్కడి ప్రతి ఆటోవాలాకు, కారు డ్రైవరుకూ ఆ ప్రాంతాల గురించి చక్కటి అవగాహన ఉంటుంది. వాళ్లను కాస్త మాటల్లో పెట్టినట్లయితే గైడ్‌ల అవసరం ఉండక పోవచ్చు. చరిత్రలో చదువుకున్న పాఠాలను కన్నులారా వీక్షించాలంటే జీవితంలో ఒక్కసారైనా రాజస్థాన్ వెళ్లి రావాల్సిందేనండోయ్..!!