పాత రూ.1000 కరెన్సీ నోటు మార్పిడికి మరో ఛాన్స్?

ఠాగూర్

బుధవారం, 29 అక్టోబరు 2025 (21:54 IST)
దేశంలో నోట్ల రద్దుకు ముందు ఉన్న పాత రూ.1000 నోట్లను మార్పిడికి భారత రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. కొన్నేళ్ల క్రితం రద్దయిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇవ్వడం లేదా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. 
 
ఇదే అంశంపై సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు తప్పని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ ఎలాంటి నిబంధనలూ జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://rbi.org.in/లో ఆర్థిక నిబంధనల సమాచారం, లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను చూసుకోవచ్చని సూచించింది.  
 
ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు ప్రజల దృష్టికి వస్తే పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగానికి పంపాలని విజ్ఞప్తి చేసింది. వాట్సప్‌ నంబర్‌ +91 8799711259, లేదా [email protected] ద్వారా ఈ-మెయిల్‌ చేయొచ్చని సూచించింది. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, 1000 నోట్లను రద్దు చేసింది. దీంతో ఏర్పడిన కరెన్సీ కొరతను తీర్చేందుకు రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటినీ వినియోగం నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి