ఇక ఆంధ్రా బ్యాంక్ కనుమరుగు - ఏప్రిల్ 1 నుంచి అమలు

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:55 IST)
97 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆంధ్రాబ్యాంక్ ఇక కనుమరుగవుతుంది. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేసింది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రావడంతో ఇకపై ఆంధ్రాబ్యాంక్‌ లోగోకు బదులు యూనియన్‌ బ్యాంకు లోగో లేదా కొత్త లోగో దర్శనమిస్తుంది.
 
బ్యాంకింగ్‌ రంగంలో తెలుగువారికో గుర్తింపు, గౌరవం అన్నట్లు ఇన్నాళ్లు కొనసాగిన ఆంధ్రాబాంక్‌ను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో స్థాపించారు. 1980 ఏప్రిల్‌లో జాతీయ బ్యాంకుగా అవతరించింది.  
 
అంతటి చరిత్ర ఉన్న బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ చాలారోజులపాటు ఉద్యోగులు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తననుకున్నట్టే విలీన ప్రక్రియను పూర్తిచేసింది. అయితే లోగో మారినా బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయాలు, లీడ్‌ బ్యాంకు కార్యాలయాలు యథావిధిగా అవే భవనాల్లో కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు