బ్యాంకులకు వారం రోజుల సెలవులు...

శుక్రవారం, 26 మార్చి 2021 (16:45 IST)
బ్యాంకులు మరోమారు వరుసగా మూతపడనున్నాయి. ఏకంగా వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. మార్చి 27వ తేదీ శనివారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఏకంగా వారం రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మధ్యకాలంలో కేవలం రెండు రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు బ్యాంకు సెలవుల గురించి వెబ్ సైట్ లో వివరాలు పెట్టింది.
 
నాలుగో శనివారం కావడంతో మార్చి 27న బ్యాంకులకు సెలవు. మార్చి 28 ఆదివారం, మార్చి 29 హోలీ కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. 
 
ఇక, ఏప్రిల్ 1న కేవలం ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలు తప్ప.. సామాన్యులకు సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4న ఆదివారం కావడంతో ఆ రోజులూ బ్యాంకులు బంద్ అవుతాయి.
 
మధ్యలో మిగిలింది మార్చి 30, ఏప్రిల్ 3వ తేదీల్లో మాత్రమే బ్యాంకులు తెరుచుకుని ఉంటాయి. పాట్నాలో అయితే మార్చి 30న కూడా బ్యాంకులకు సెలవు దినంగానే ప్రకటించారు. 
 
దీంతో నగదు లేదా చెక్ డిపాజిట్లపై పెద్ద ప్రభావం పడనుంది. అయితే, బ్యాంకులు మూతపడినా ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎలాంటి ఆటంకాల్లేకుండా సాగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు