శక్తిమంతమైన మహిళల జాబితాలో నిలిచి, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఎన్నోఏళ్ల పాటు సేవలందించిన చందా కొచ్చర్ భవిష్యత్ గందరగోళంలో పడే సూచనలున్నాయి. వీడియోకాన్ సంస్థకు అందించిన రుణాల్లో ఆమె భర్త అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో.. చందా కొచ్చర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొచ్చర్ తన పదవికి రాజీనామా చేయనున్నారని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
చందా కొచ్చర్ భర్త అవకతవకలకు పాల్పడిన కేసుపై విచారణ జరుగుతుండటంతో.. చందా కొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవికి రాజీనామా చేయాల్సిందిగా కొందరు డైరక్టర్లు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఆమె సీఈవో పదవిలో కొనసాగడానికి ఏమాత్రం అర్హురాలు కాదని పలువురు బయటి డైరెక్టర్లు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే తదుపరి కార్యాచరణ కోసం బ్యాంకు బోర్డు సమావేశం కాబోతోందని తెలుస్తోంది.