ఆదాయ పన్ను చెల్లించలేదా? మీ పరువు తీస్తారట.. గ్యాస్ సబ్సీడీ కూడా రద్దు.. ఎలా?

మంగళవారం, 21 జూన్ 2016 (14:40 IST)
ఆదాయ పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి పరువును గంగపాలు చేయాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని రకాల కఠిన, వింతైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. పైగా, తీసుకునే చర్యల వివరాలను కూడా వెల్లడించింది కూడా. 
 
తగిన ఆదాయం ఉన్నప్పటికీ అనేక మంది పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు. ఇలాంటి వారి భరతం పట్టనుంది. ఇందులోభాగంగా, పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందే అన్ని సదుపాయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. 
 
తాజా నిర్ణయాల ప్రకారం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను నిలిపివేస్తారు. ఏ బ్యాంకుల్లోనూ రుణాలు మంజురు కాకుండా చేస్తారు. బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రద్దు చేస్తారు. వంట గ్యాస్ సబ్సిడీని తొలగిస్తారు. వారి పేరిట ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిలుపుదల, కొత్త ఆస్తులను కొనుగోలు చేసినా వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని ఐటీ కార్యాలయాలకు సమాచారం పంపించారు. 
 
అలాగే, సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్)లోని సమాచారాన్నంతా సమీకరించి, వాటి ఆధారంగా డిఫాల్టర్లను గుర్తించి వారి పేర్లను జాతీయ దినపత్రికల్లో ప్రచురించి పరువు తీయాలని, ఇదే సమాచారాన్ని 'నేమ్ అండ్ షేమ్' జాబితాలో ఉంచాలని కూడా నిర్ణయించింది. ఈ తరహా చర్యలతో వారందరినీ పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి చేర్చవచ్చన్నది ఐటీ విభాగం అధికారుల ఆలోచన. మరి ఈ కొత్త ఆలోచనలు ఎంత వరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి