విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక అంశాల కోసం అంకితమైన ఎన్జీవో నైబర్‌హుడ్ ఫౌండేషన్ నేడు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ‘ఫీడ్ బై ఆర్ట్’ శీర్షికన ఆర్ట్ పోటీలను నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఆకలి నుంచి ఉపశమనం కోసం తాము చేసే ప్రయత్నాలకు నిధుల సమీకరణలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
వర్ట్యువల్‌గా నిర్వహించబోయే ఈ పోటీల కోసం రిజిస్ట్రేషన్లను చేసుకోవడంతో పాటుగా తమ ఆర్ట్స్‌ను సెప్టెంబర్ 25,2021 లోపుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోటీలలో పాల్గొనేందుకు 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నేరుగా ఫౌండేషన్ యొక్క ఆకలి-ఉపశమన ప్రాజెక్ట్ ఫీడ్ ఎట్ 100కు చేరుతుంది. ఈ మొత్తంతో ఒకేసారి ముగ్గురు మనుషులతో పాటుగా రెండు జంతువులకు సైతం ఆహారం అందిస్తారు. రిజిస్ట్రేషన్లను nhf-global.org/feedbyart/ద్వారా చేసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన నిర్వహించే వరల్డ్ ఫుడ్ డే 2021లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. నాలుగు విభాగాలలో తమ ఎంట్రీలను అభ్యర్ధులు పంపవలసి ఉంటుంది. మొదటి విభాగంలో భాగంగా 1-3 వ తరగతి విద్యార్థులు ‘జంక్ ఫుడ్ వద్దు’ నేపథ్యంతో తమ ఆర్ట్ పంపాల్సి ఉంటుంది. రెండవ విభాగంలో 4-5 తరగతుల విద్యార్థులు ‘ఆహారం వ్యర్థం చేయరాదు ’నేపథ్యంతో తమ చిత్రాలను పంపాల్సి ఉంటే మూడవ విభాగంలో 6-8 తరగతుల విద్యార్థులు ‘ఆరోగ్యవంతమైన ఆహారం, ఆరోగ్యవంతమైన భూగోళం’ నేపథ్యంతో, నాల్గవ విభాగంలో 9-10 తరగతుల విద్యార్థులు ‘ఆకలి రహిత దేశం’ నేపథ్యంతో తమ చిత్రాలను పంపాల్సి ఉంటుంది.
ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇ-సర్టిఫికెట్ అందించడంతో పాటుగా విజేతలకు నగదు బహుమతి, మెడల్స్, ట్రోఫీలను అందిస్తారు. ఈ ఆర్ట్ పోటీ గురించి నెయిబర్‌హుడ్ ఫౌండేషన్ ఫౌండర్ ఆర్ హేమంత్ మాట్లాడుతూ, ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదికల ప్రకారం 2019లో 14.5% మంది భారతీయులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ఫీడ్ బై ఆర్ట్ పోటీల ద్వారా పాఠశాల విద్యార్థులకు వీరి కష్టాల పట్ల అవగాహన కలుగనుందని ఆశిస్తున్నాం. అలాగే ఆహార వ్యర్థాలను నివారించడం, పౌష్టికాహారం తీసుకోవడం పట్ల కూడా వారికి అవగాహన మెరుగుపడనుంది. ఈ పోటీలలో లక్షలాది మంది విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి రోజూ 6వేల మంది ప్రజలు, 4వేల జంతువులకు ఆహారం అందించడం లక్ష్యంగా చేసుకున్నాం..’’ అని అన్నారు.