ఈపీఎఫ్‌ స్కీములో కొత్త నిబంధన... ఉద్యోగులకు మేలా? కీడా?

బుధవారం, 28 ఆగస్టు 2019 (17:18 IST)
ఈపీఎఫ్ స్కీములో కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ఈ కొత్త నిబంధన మేరకు ఉద్యోగులందరికీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఒకేలా ఉండదు. అలాగే, ఈ స్కీం కింద వారు చెల్లించే మొత్తంలో కూడా వ్యత్యాసం ఉండనుంది. అయితే, ఈ కొత్త నిబంధన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు మేలుచేస్తుందా లేదా ప్రైవేటు కంపెనీలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు మేలు చేస్తుందా అనే విషయాన్ని పరిశీలిద్ధాం.
 
ప్రస్తుతం ఉద్యోగులు తమ బేసిక్‌ వేతనంలో 12 శాతం చొప్పున పీఎఫ్ కంట్రిబ్యూషన్ కింద కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. ఇంతే శాతంలో యాజమాన్యాలు కూడా తమ వాటాగా ఈపీఎఫ్‌కు చెల్లిస్తున్నాయి. ఉద్యోగుల చెల్లింపు వాటాను తగ్గిస్తూ కార్మిక శాఖ ఈపీఎఫ్‌ సవరణ బిల్లు (2019)ని రూపొందించింది. పింఛను పథకంలో కూడా ప్రభుత్వం మార్పులు తీసుకురానున్నది.
 
ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్)తో పాటు జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)లో ఏదో ఒకదానిలో చేరే అవకాశం ఉద్యోగికి కల్పిస్తారు. ఈ బిల్లుపై ఉద్యోగ, కార్మిక సంఘాలు, పీఎఫ్‌ సభ్యులు, ఆయా సంస్థల యాజమాన్యాలు తమ అభ్యంతరాలను సెప్టెంబరు 22లోగా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. 2004 జనవరి 1 తర్వాత సర్వీసులో చేరేవారికి ఎన్‌పీఎస్‌ అమలుకానుంది. 
 
అయితే, ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ మేలు పొందనున్నారు. ఈపీఎఫ్‌ స్కీం కింద ఉద్యోగులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదించింది. దీంతో ఉద్యోగులకు చేతికొచ్చే వేతనం పెరుగుతుంది. అయితే ఉద్యోగులందరికీ పీఎఫ్‌ కాంట్రిబ్యుషన్‌ మొత్తం ఒకేతీరుగా ఉండదు. వారి వయస్సు, మహిళ లేదా పురుషుడు, వారి వేతన గ్రేడ్‌ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని పీఎఫ్‌కు ఉద్యోగుల వాటా ఎంత చెల్లించాలన్నది నిర్ణయిస్తారు. సంస్థల యాజమాన్యాల వాటాలో ఎలాంటి మార్పు ఉండదు. 
 
అంతేకాకుండా, సామాజిక భద్రతా ప్రయోజనాలను మరింతగా విస్తరించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డ్రైవర్లు, ఇంటి పనివారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా పీఎఫ్‌ ప్రయోజనాలను కల్పించడంపై దృష్టి పెట్టింది. అసంఘటిత రంగంలోని వారికి ఇప్పటికే ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ ధన్‌ పెన్షన్‌ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత లబ్ధి కలిగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు