ఎంబీబీఎస్ అభ్యర్థులకు శుభవార్త. నీటీ పీజీ 2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించింది. ఆ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఆగస్టు 11వ తేదీ వరకు కేంద్రం పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ యేడాది మార్చి 31వ తేదీ నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవారే నీట్ పీజీ 2023 పరీక్షకు అర్హులని తొలుత ప్రకటించారు. ఈ కటాఫ్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ గత నెల 13వ తేదీన నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ గత యేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ యేడాది జూన్ 30వ తేదీ లోపు అది పూర్తయ్యే అవకాశం లేదు. ఫలితంగా చాలా మంది విద్యార్థుల నీటీ పీజీ పరీక్షకు దూరమయ్యే అవకాశాలు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల వినతి మేరకు కేంద్ర ఈ గడువును ఆగస్టు 11వ తేదీ వరకు పొడగించింది.
మరోవైపు- ఎండీఎస్ నీట్ రాసేందుకు వీలుగా బీడీఎస్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఎండీఎస్ నీట్ అభ్యర్థులు శుక్రవారం (ఈ నెల 10) సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం (ఈ నెల 12) అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.