వంటింట్లో గ్యాస్‌ వృధా కాకుండా ఉండాలంటే..!!

ప్రస్తుతం గ్యాస్ ధర విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో గ్యాస్‌ను పరిమితంగా వాడుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే గ్యాస్ వృథా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అలాగే వంటనూ త్వరగా పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్యంగా రుచికరంగా, పోషక విలువలు కోల్పోకుండా వంటను తయారు చేసుకోవచ్చు. సరైన మంట, తగినంత నీరు, సరిపడిన పాత్ర ఇలాంటి చిన్నచిన్న అంశాలు వంట చేసే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఇందుకోసం మీరు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

* వంటకు అన్ని వస్తువులను సిద్ధం చేసుకున్న తర్వాతే గ్యాస్ స్టౌవ్‌ను వెలిగించాలి.
* కాయగూరలను ఉడకబెట్టడానికి తగినంత నీరు మాత్రమే వాడాలి. ఎక్కువ నీరు పోసి వండితే పోషకాలు వృథా కావడమే కాకుండా గ్యాస్, సమయం కూడా వృథా అవుతుంది.
* కాయకూరలు, పప్పులను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకోవచ్చు.
* ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడి చేసేందుకు వెంటనే స్టౌవ్‌పై పెట్టకూడదు. తొలుత గది టెంపరేచర్‌కు తెచ్చిన తర్వాత స్టౌవ్‌పై ఉంచాలి.

* మంట పాత్ర అడుగుభాగాన్ని దాటి పైకి వస్తుంటే గ్యాస్ వృధా అవుతున్నట్టుగా గుర్తించాలి.
* బర్నర్ రంధ్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్ వృథా అవుతుంది.
* గ్యాస్ స్టౌవ్ వెలిగించినపుడు మంట నీలిరంగులో ఉండాలి. ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో మండుతుంటే గ్యాస్ వృథా అవుతున్నట్టుగా గ్రహించి వెంటనే సర్వీసింగ్‌కు చేయించాలి.

* కూరగాయలు, అన్నం తయారు చేసేటపుడు పాత్రలపై విధిగా మూతను వాడాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వృథాకావు. పదార్థాలు త్వరగానూ ఉడుకుతాయి.
* ముఖ్యంగా, స్టౌవ్‌ను ఎప్పటికపుడు సర్వీంగ్‌ చేయిస్తుంటే మంట బాగా వచ్చి త్వరగా అవుతుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకునే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి