కేరళలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తాకిన వారి సంఖ్య 39కి పెరిగింది. కేరళకు చెందిన ఈ ఐదుగురికి ఆదివారం పాజిటివ్ పరీక్షలు చేయడంతో భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 39కి పెరిగాయి. మూడు కొత్త కరోనావైరస్ కేసులలో, రెండు లడఖ్ నుండి, ఒకటి తమిళనాడు నుంచి నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరి ఆరోగ్యం నిలకడగా వున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కేరళలోని ఓ కుటుంబం కరోనా వ్యాపి చెందినా ఆరోగ్య శాఖకు తెలియజేయకపోవడం, డాక్టర్ల వద్దకు వెళ్లకపోవడంతో ఈ కరోనా సులభంగా ఇతరులకు సోకింది. కేరళ, పత్తినంతిట్టకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకిందని కేరళ మంత్రి శైలజ వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు.. కేరళలోని ఇద్దరు బంధువులను కలిశారు. వీరు కరోనా పరీక్షలకు విమానాశ్రయంలోనే సహకరించలేదని తెలుస్తోంది. కేరళకు వచ్చి మరో ఇద్దరు వృద్ధులైన ఇద్దరు బంధువులను కలిశారు. వారికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఇసోలేషన్‌కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.
కరోనా వ్యాప్తిపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాకు తగినంత నిర్బంధ సదుపాయాల కోసం స్థలాలను గుర్తించాలని, వ్యాధి మరింత వ్యాప్తి చెందితే క్లిష్టమైన సంరక్షణ కోసం సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.