ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణ ఘోష - కొత్త కేసులు 10,820

ఆదివారం, 9 ఆగస్టు 2020 (22:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణ ఘోష వినిపిస్తోంది. ఒకవైపు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులతో పాటు మరోవైపు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 97 మంది మృత్యువాత పడ్డారు. 
 
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు చోటుచేసుకోగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,036కి పెరిగింది.
 
ఇక, కొత్తగా 10,820 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. తాజాగా మరో 9,097 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 87,112 మంది చికిత్స పొందుతున్నారు. 
 
తెలంగాణాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి 
తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 1669 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. ఆసుపత్రుల్లో 22,869 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 55,999 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 627కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 139 కేసులు నమోదయ్యాయి.
 
దేశంలో 21 లక్షలు దాటిన కేసులు 
అదేవిధంగా దేశంలోనూ కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 64,399 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 861 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 21,53,011కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 43,379కి పెరిగింది. 6,28,747 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 14,80,885 మంది కోలుకున్నారు.
 
కాగా, శనివారం వరకు మొత్తం 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులో 7,19,364  శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు