తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో నిన్న కరోనాతో 14 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 705 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,18,20,842కి చేరింది.
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. కేవలం 12 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 6వ తేదీన 8 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.69 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
గత 12 రోజుల్లోనే ఇది డబుల్ అయినట్టు పేర్కొంది. కాగా, పాజిటివిటీ రేటు గత నెలలో 3.05 శాతంగా ఉండడం గమనార్హం. ఇప్పుడది 13.54 శాతానికి చేరుకుంది. ఇక వారపు పాజిటివిటీ రేటు విషయంలో ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 30.38 శాతం నమోదు కాగా, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్థాన్‌లో 23.33, మధ్యప్రదేశ్‌లో 18.99 శాతం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇది 30 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.