అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో కొవిడ్ మహమ్మారికి దాదాపు 2500 మందికిపైగా ప్రజలు బలైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఏప్రిల్ తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. కరోనా టీకాపైనే అమెరికా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము అభివృద్ధి చేసిన టీకా 90శాతానిపైగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి. టీకా అత్యవసర వినియోగం కోసం అనుమతి కోరుతూ ఎఫ్‌డీఏ, ఈయూకు దరఖాస్తు కూడా చేసుకున్నాయి. డిసెంబర్ చివరి నాటికి అమెరికన్లు ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.