ఏపీలో కరోనా వైరస్ ఉధృతి.. 24 గంటల్లో 6,000 మార్కును తాకిన కేసులు

బుధవారం, 7 అక్టోబరు 2020 (21:43 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,769 మందికి కరోనా టెస్టులు నిర్వహించిన ప్రభుత్వం 5,120 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించింది. 34 మంది మృతి చెందారు. మరో 6,349 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 7,34,427కు చేరింది. వీరిలో 6,78,828 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 49,513 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి, చిత్తూరులో 807 చొప్పున కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలులో 144, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 172 కేసులు చొప్పున నమోదయ్యాయి. తొమ్మిది జిల్లాల్లో 50వేలకు పైగా కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
మరో ఐదు జిల్లాల్లో ఐదు వందలకు పైగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో తూర్పుగోదావరిలో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురేసి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురేసి, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరిలలో ఇద్దరేసి, ప్రకాశంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
 
రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6,086కు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 62,83,009 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు