తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన మబ్బులు - నేటి నుంచి విస్తారంగా వర్షాలు

బుధవారం, 7 అక్టోబరు 2020 (14:24 IST)
తెలుగు రాష్ట్రాలను దట్టమైన మబ్బులు కమ్మేశాయి. దీంతో బుధవారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం, ఇదేసమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 
 
ఈ ద్రోణి కారణంగా బుధవారం సాయంత్రం నుంచి రానున్న 48 గంటల వరకూ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
దాదాపు అన్ని ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి వెల్లడించారు. 
 
గత 24 గంటల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల్లో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు