'కరోనా' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

శనివారం, 28 మార్చి 2020 (08:48 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు మరింత ఉధృతంగా మారింది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే వేలాది మంది మృత్యువాతపడ్డారు. లక్షలాది కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ వైరస్‌ ఆకారాన్ని పూణెలోని శాస్త్రవేత్తలు ఫోటో తీశారు. 
 
ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి ఈ ఫోటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ యేడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది.
 
చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. 
 
ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన 'సార్స్-కోవ్-2' వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఇది అచ్చం 'మెర్స్-కోవ్' వైరస్‌ను పోలి ఉంది. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం. 
 
కరోనా పరివర్తనాన్ని అధ్యయనం చేసేందుకు, జెనెటిక్‌ మూలాలు, వైరస్‌ ఎలా రూపాంతరం చెందుతున్నదో గుర్తించేందుకు, జంతువుల నుంచి మనుషులకు.. మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ ఎలా సంక్రమిస్తున్నదో తెలుసుకునేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడుతాయని వారు వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు