కరోనావైరస్ క్వారెంటైన్ ఇంటికి సీల్, ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు

శుక్రవారం, 24 జులై 2020 (18:27 IST)
కోవిడ్‌-19 రోగి ఉన్న కుటుంబాన్ని హోం క్వారంటైన్‌ చేసేందుకు బెంగళూర్‌ మున్సిపల్‌ అధికారులు రెండు ఫ్లాట్లను రేకులతో సీల్‌ చేయడంపై విమర్శలు రావడంతో వాటిని తొలగించారు. సీల్‌ చేసిన ఫ్లాట్లను స్ధానికుడు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తమ బిల్డింగ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నిర్ధారణ కావడంతో మున్సిపల్‌ అధికారులు భవనాన్ని సీజ్‌ చేశారని, ఆ ఇంట్లో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులున్నారని, పక్కనే వయసు మళ్లిన దంపతులు నివసిస్తున్నారని స్ధానికుడు సతీష్‌ సంగమేశ్వరన్‌ ట్వీట్‌ చేశారు. 
 
ఈ రెండు ఫ్లాట్లను రేకులతో కప్పివేస్తూ సీజ్‌ చేశారని పొరపాటున అక్కడ అగ్నిప్రమాదం తలెత్తితే పరిస్థితి ఏమిటని అధికారులను ఆయన తప్పుపట్టారు. కంటెయిన్మెంట్‌ ప్రాధాన్యతను అర్థం చేసుకుంటామని, అయితే అగ్నిప్రమాదం ముప్పు నెలకొంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందం సైతం కిరాణా ఇతర నిత్యావసరాలను ఆ కుటుంబాలకు అందచేయడం కష్టమని పేర్కొన్నారు.
 
అధికారుల తీరుపై విమర్శలు చెలరేగడంతో బృహత్‌ బెంగళూర్‌ మహానగర పాలిక కమిషనర్‌ (బీబీఎంపీ) మంజునాథ ప్రసాద్‌ తమ సిబ్బంది తీరుపై క్షమాపణ కోరారు. తక్షణమే ఫ్లాట్‌ ముందు ఏర్పాటు చేసిన రేకులను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
 
బారికేడ్లను తొలగించేలా చర్యలు చేపట్టానని, అందరినీ గౌరవంగా చూడటం తమ బాధ్యతని ఆయన చెప్పుకొచ్చారు. వైరస్‌ సోకినవారిని కాపాడటంతో పాటు ఇతరులకు వైరస్‌ సోకకుండా కాపాడటమే కంటైన్మెంట్‌ ఉద్దేశమని వివరించారు. స్ధానిక సిబ్బంది అత్యుత్సాహం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు