దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి చేయిదాటిపోయినట్టు కేంద్రం అభిప్రాయపడింది.
మహారాష్ట్ర, పంజాబ్‌లలో పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. గత 24 గంటలలోనే మహారాష్ట్రలో 28 వేల కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. అటు పంజాబ్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడి కేసులు చాలా ఎక్కువ అని భూషణ్ అన్నారు.
ఇక దేశంలో పది జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. అందులో 9 జిల్లాలు మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం. పుణె, నాగపూర్, ముంబై, థానె, నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, జల్‌గావ్, అకోలాలతోపాటు కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాల్లో కేసులు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు, కరోనా టీకా తీసుకొన్నవారు రక్తాన్ని దానం చేయడంపై నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్ (ఎన్‌బీటీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ఏ కంపెనీది అన్నదానితో సంబంధం లేకుండా.. టీకా రెండో డోసు తీసుకొన్న 28 రోజుల వరకు రక్తం దానం చేయవద్దని సూచించింది.
ఇదిలావుంటే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.