కరోనా హాట్‌స్పాట్‌గా రష్యా - మాస్కోను వీడుతున్న ప్రజలు

శుక్రవారం, 8 మే 2020 (12:31 IST)
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఈ సామెత ఇపుడు అగ్రరాజ్యం రష్యాకు అచ్చుగుద్దినట్టు సరిపోయింది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. కానీ రష్యా పాలకులు మాత్రం ఈ వైరస్ తమను ఏం చేయదులే అనే ధోరణితో ఉన్నారు. దీనికి ఇపుడు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రంగా రష్యా మారింది. ఫలితంగా ఆ దేశ రాజధాని ప్రజలు మాస్కోను వీడి తరలిపోతున్నారు. 
 
నిజానికి తాము కరోనా వైరస్‌ను కట్టడి చేశామని రష్యా పాలకులు సంబరపడిపోయారు. కానీ, ఆ దేశ ప్రజల ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. గత వారం పదిరోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషూస్టిన్, సాంస్కృతిక మంత్రి ఓల్గా లూంబిమోవాస్, గృహనిర్మాణ మంత్రి వ్లాదిమర్‌ యకుషేవ్‌లును కూడా వైరస్ వదల్లేదు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
దీనికి కారణం కరోనా వైరస్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల కంటే ముందే తేరుకున్నప్పటికీ లాక్‌డౌన్ విషయంలో ఆలస్యం చేయడమే ఆ దేశం కొంప ముంచింది. రోజురోజుకు వందల సంఖ్యతో పెరుగుతున్న కేసులతో రష్యా ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా దాటేసింది. అధ్యక్షుడు పుతిన్ అధికార కాంక్షే రష్యా ప్రస్తుత దుస్థితికి కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. 2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఆరాటంతో మిగతా విషయాలను గాలికి వదిలేసిన పుతిన్ రాజ్యాంగ సవరణ విషయంలో బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంకా కరోనాపై దృష్టిసారించక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రష్యన్లు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం రష్యా వ్యాప్తంగా ఏకంగా 1.77 లక్షల కేసులు నమోదైవుండగా వీటిలో సగం కేసులు ఒక్క మాస్కోలోనే నమోదుకావడం ఆ దేశ పరిస్థితికి అద్దంపడుతోంది. అలాగే, 1625 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భయపడుతున్న ప్రజలు మాస్కోను వీడుతున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా రాజధానిని వీడారు. అలాగే, రష్యాలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా తమతమ ప్రాంతాలను వీడిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు