తమిళనాట సంచలన సినిమాలు నిర్మించిన వి స్వామినాథన్ కరోనాతో మృతి చెందాడు. ఈ మధ్యే ఈయనకు కరోనా సోకింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు ఈయన. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆగస్ట్ 10న ఈయన మరణించాడు. నిర్మాత స్వామినాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తమిళ చిత్ర పరిశ్రమలో ఈయనది దాదాపు పాతికేళ్ల ప్రస్థానం. తమిళనాట ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లక్ష్మీ మూవీ మేకర్స్ భాగస్వాముల్లో స్వామినాథన్ కూడా ఒకడు. ఈయనతో పాటు ఆ నిర్మాణ సంస్థలో కె మురళీధరన్, వేణుగోపాల్ ఉన్నారు.
వీళ్ల నిర్మాణంలో అరణ్ మనై కావలన్ చిత్రాన్ని తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత గోకులంలో సీతై, ప్రియముడన్, భగవతి, అన్బే శివం లాంటి హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా విజయ్‌తో నిర్మించిన భగవతి.. కమల్ అన్బే శివం సినిమాలు స్వామినాథన్ నిర్మాణ సంస్థకు మంచి పేరు తీసుకొచ్చాయి. స్వామినాథన్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.