స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సీఎం తెలిపారు. ఈ ముగ్గురికి పనాజీలోని గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈ ముగ్గురు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో, వారు పర్యటించిన ప్రాంతాలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ ముగ్గురితో కలిసి తిరిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతామని గోవా సీఎం పేర్కొన్నారు. కరోనా సోకిన వారి వయస్సు 25 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్లానింగ్) రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు. మృతుడు హైదర్‌పురాకు చెందిన వ్యక్తిగా ఆయన తెలిపారు.
ఈ వృద్ధుడితో సన్నిహితంగా ఉన్న మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 11 మంది కరోనా వైరస్ సోకిందనీ, వారిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించినట్టు తెలిపారు.