ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6 లక్షలను దాటగా, మొత్తం కేసుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్న రష్యాకన్నా 50 వేల కేసులు మాత్రమే తక్కువగా ఉన్నాయి. భారత్‌లో రోజుకు దాదాపు 20 వేల కేసులు వస్తున్నవేళ, మరో నాలుగైదు రోజుల్లోనే ప్రపంచంలో కరోనా కేసుల్లో మూడో స్థానానికి ఇండియా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
తొలి స్థానంలో అమెరికా 26 లక్షలకు పైగా కేసులతో ఉండగా, రెండో స్థానంలో బ్రెజిల్ 14 లక్షల కేసులతో కొనసాగుతున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే, కొత్తగా వస్తున్న కేసుల్లో 90 శాతం 10 రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
ఇదేసమయంలో ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కాస్తంత తగ్గింది. జూన్‌లోనే ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షను దాటుతుందని తొలుత అంచనా వేయగా, ప్రస్తుతం 87 వేల కేసులకు ఢిల్లీ చేరుకుంది. కంటెయిన్మెంట్ జోన్లలో పాటిస్తున్న కఠిన నిబంధనలు కొంతమేరకు ప్రభావం చూపుతున్నాయి.
లాక్డౌన్ నిబంధనలను సడలించడం ప్రారంభించిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. ఈ భయంతోనే ఇప్పటికీ, అంతర్జాతీయ విమానాల సర్వీసును, స్కూళ్లు, కాలేజీలు, పబ్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక, అన్‌లాక్ 2.0లో భాగంగా కీలక నిర్ణయాలను ఏమీ తీసుకోలేదు. జూన్ నెలాఖరు వరకూ ఉన్న నిబంధనలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.