తొలిటెస్టు: సెహ్వాగ్ సెంచరీ - రాణించిన జాఫర్

శుక్రవారం, 28 మార్చి 2008 (11:13 IST)
భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. దీంతో తన బ్యాటింగ్ పదును సఫారీలకు రుచి చూపించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో తన వీరబాదుడుతో టెస్టుల్లో 14వ సెంచరీ (104 నాటౌట్)ని పూర్తి చేశాడు. వన్డేను తలపించే రీతిరో ఆడిన సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అలాగే మరో ఓపెనర్ వసీం జాఫర్ కూడా క్రీజ్‌లో కుదురుకొని అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో భారత జట్టు 165 పరుగులతో భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన భారత ఓపెనర్లు సఫారీల బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. జాఫర్, సెహ్వాగ్‌లు ఓపెనింగ్ భాగస్వామ్యంగా 165 పరుగులు చేశారు. భారత ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించిన ఫలితం కనిపించలేదు. ఇప్పటి వరకు సఫారీలు 40 ఓవర్లు బౌల్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేక పోయారు.

వెబ్దునియా పై చదవండి