మాస్టర్ కెరీర్‌లో వరల్డ్ కప్ చేరాలన్నదే ప్రజల ఆకాంక్ష!
సోమవారం, 31 జనవరి 2011 (18:01 IST)
FILE
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఇన్నాళ్ళు కొరతగా మిగిలిన వన్డే ప్రపంచకప్ చేరాలని యావత్తు క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది.
దేశంలోని 1.2 బిలియన్ ప్రజలు ఈసారి టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుని, సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో లేని వరల్డ్‌కప్ టైటిల్‌ను సాధించాలని ప్రజలు ఆశిస్తున్నారు. భారత ఉపఖండంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన సత్తా ఏంటో నిరూపించుకుని సచిన్ టెండూల్కర్ కలను సాకారం చేయాలని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
లిటిల్ మాస్టర్ క్రికెట్ కెరీర్‌లో వన్డే, టెస్టుల్లో బ్యాటింగ్ రికార్డు, అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు వంటి రికార్డుల పరంగా ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాస్టర్‌కు కెరీర్‌లో లేనిది వరల్డ్‌కప్ టైటిల్ ఒక్కటే. ఇంకా సచిన్‌కు ఇదే చివరి ప్రపంచకప్ కావొచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో... మాస్టర్ విషయంలో ఈ ఒక్క కొరత తీరాలని, అందుకు టీమిండియా ఆటగాళ్లు మెరుగ్గా రాణించాలని అభిమానులు, ప్రజలు ఆశిస్తున్నారు.
టీమిండియా జట్టులో సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ధోనీల రూపంలో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఒక ఎత్తైతే, సచిన్ ఒక్కడు మరో ఎత్తు. పటిష్టంగా ఉన్న టీమిండియా తప్పక గెలవాలని, సచిన్ ఖాతాలో వరల్డ్ కప్ టైటిల్ కూడా చేరాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. 37 ఏళ్ల సచిన్ టెండూల్కర్ 2003, 1996లో జరిగిన జరిగిన వరల్డ్ కప్‌లో ఆడాడు. కానీ 2003, 1996 వరల్డ్‌కప్‌ల్లో టీమిండియా సెమీఫైనల్స్‌తో సరిపెట్టుకుంది. కానీ 1996 ప్రపంచకప్‌లో 523 పరుగుల అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు.
2003లో కూడా 673 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సచిన్ అదరగొట్టినా టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకోవడం చిరకాల స్వప్నంగానే మిగిలిపోయింది. ఇకపోతే.. 1999లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేదువార్తతో అర్థాంతంగా స్వదేశం చేరుకోవాల్సి వచ్చింది. అదే సచిన్ తండ్రి మరణం. ఇప్పటివరకు 36 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ 1,796 పరుగులు సాధించిన మంచి రికార్డును సంపాదించుకున్నాడు.
అంతేగాకుండా నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. కాగా, 2010లో గ్వాలియర్‌లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన సచిన్ టెండూల్కర్, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి గాయం కారణంగా స్వదేశానికి చేరుకున్నాడు. ఇంకేముంది.. వన్డే ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ ధీటుగా రాణించి భారత్‌ను విశ్వవిజేతగా నిలవాలని ఆశిద్దాం. ఇంకా భారత్ గెలుపొంది ఈ వరల్డ్‌కప్‌ను 'సచిన్ వరల్డ్‌కప్'గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిద్దాం.