గత 11980 జూలై 3న పంజాబ్ లోని జలంధర్‌లో జన్మించిన హర్భజన్ సింగ్... అంటే తెలియని వారంటూ ఉండరు. అదీ భజ్జీ అంటే ఇక చెప్పనవసరంలేదు. 1998లో టెస్ట్ మరియు వన్డే క్రికెట్‌లో భారత జట్టులో స్థానం సంపాదించిన హర్భజన్, తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
నాగ్‌పూర్‌లో జరుగుతున్న భారత్-ఆసీస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భజ్జీ 300 వికెట్ల క్లబ్‌లో స్థానం సంపాదించాడు. రికీ పాంటింగ్‌ను 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌డబ్ల్యూగా అవుట్ చేయడంతో భజ్జీ 300 వికెట్లు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.
టెస్టు క్రికెట్‌లో భారత్ తరపున 300 వికెట్ల క్లబ్‌లో చేరిన వారిలో హర్భజన్ మూడో వ్యక్తి కాగా... ఇప్పటికే కపిల్, కుంబ్లే మొదటి, రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. తాజాగా హర్భజన్ కూడా 300 వికెట్ల క్లబ్‌లో చేరడంతో కపిల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే... టీం ఇండియా జట్టులోకి ప్రవేశించేందుకు ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత మరియు క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్, 2001వ సంవత్సరంలో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి చేరాడు.
ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫీలో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్‌గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్‌లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్‌గానూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.