జట్టు సభ్యునిగా, కెప్టెన్‌గా దాదాపు 16ఏళ్ల పాటు సేవలందించిన మహ్మద్ అజారుద్ధీన్‌కు భారత క్రికెట్లో ఓ ప్రత్యేక స్థానముంది. సాధారణ వ్యక్తిగా 20ఏళ్ల వయసులో భారత క్రికెట్ జట్టులో ప్రవేశించిన అజారుద్ధీన్ అటుపై 16ఏళ్లపాటు కెరీర్‌ను కొనసాగించడం విశేషం.
హైదరాబాద్‌లోని ఓ సాధారణ ముస్లీం కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికయ్యే సమయంలో అజహర్ కుటుంబం ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. అలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినా కేవలం తన ప్రతిభతో అజహర్ భారత క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన అజారుద్ధీన్ అటుపై 1985లో బెంగుళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే కెరీర్ ప్రారంభించాడు. ఆనాటి నుంచి 2000 ప్రారంభం వరకు భారత జట్టులో కొనసాగిన అజారుద్ధీన్ ఓ ప్రతిభ కల్గిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
కెరీర్ ఊపందుకున్న సమయంలో కెప్టెన్‌గానూ జట్టును విజయ పథంలో నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. కెరీర్లో 334 వన్డేలు, 99 టెస్టులు ఆడిన అజహర్ ఎన్నో మ్యాచ్‌లలో గెలుపు ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. వన్డేల్లో 9378 పరుగులు చేసిన అజహర్ టెస్టుల్లో 6215 పరుగులు సాధించాడు.
ఇందులో వన్డేలకు సంబంధించి ఏడు సెంచరీలు మాత్రమే సాధించినా టెస్టుల్లో మాత్రం 22 సెంచరీలు సాధించి తన సత్తా చాటాడు. కేవలం ప్లేయర్‌గానే కాక మంచి కెప్టెన్‌గా కూడా అజహర్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. మణికట్టు తిప్పుతూ అజహర్ ఆడే తీరు అతనికి ఎంతోమంది క్రీడాభిమానుల్ని సంపాదించిపెట్టింది.
అలాగే కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడంలోనూ అజహర్ అందరి మన్ననలు అందుకున్నాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అజారుద్ధీన్ కెరీర్ చివర్లో మాత్రం వివాదాల సుడిలో చిక్కుకున్నాడు.
బెట్టింగ్ వివాదంలో చిక్కుకుని కెరీర్‌ను అర్థాంతరంగా ముగించిన ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ ఆటగాడిగా మాత్రం అందరి అభిమానాన్ని అందుకోవడం విశేషం.