క్రికెట్లో టెస్ట్ మ్యాచ్‌లకు ఓ విశిష్టమైన గుర్తింపు ఉంది. వన్డేల్లో చెప్పుకోదగ్గ గుర్తింపు సాధించిన ఆటగాళ్లు సైతం తమ కెరీర్లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇందుకు కారణం లేక పోలేదు. వన్డేలు లాంటి నిర్ణీత ఓవర్ల మ్యాచ్‌లలో పరుగులు సాధించడానికి నైపుణ్యంతో పాటు కాస్త దూకుడు కూడా ఉండాలి.
అయితే టెస్ట్ మ్యాచ్‌లు అనేవి ఇందుకు పూర్తిగా విరుద్ధం. టెస్టు మ్యాచ్‌లు ఆడాలంటే నైపుణ్యంతో పాటు క్రీజులో ఎక్కువ సమయం గడిపే ఓపిక, అందుకు తగ్గ మానసిక సంసిద్ధత ముఖ్యం. అందుకే ఓ క్రికెటర్ టెస్ట్ మ్యాచ్‌లలో కూడా రాణిస్తేనే అతను పరిపూర్ణత సాధించినట్టుగా భావిస్తారు.
ఇంతటి విశిష్టత కల్గిన టెస్ట్ మ్యాచ్‌లలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న ఆటగాడిగా భారత్ తరపున వీవీఎస్ లక్ష్మణ్ పేరును మనం ప్రస్తావించవచ్చు. దాదాపు 12 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న లక్ష్మణ్ టెస్ట్ క్రికెట్లో తన సత్తా చాటాడు. టెస్టుల్లో చక్కగా రాణించే లక్ష్మణ్ అంటే ప్రపంచ ఛాంపియన్లు అయిన ఆస్ట్రేలియన్లకు సైతం ఓ కొరకరాని కొయ్యే.
భారత్ తరపున ఆస్ట్రేలియాపై చక్కని రికార్డు ఉన్న లక్ష్మణ్ ఆస్ట్రేలియా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు సదా సిద్ధంగా ఉంటాడు. అందుకేనేమో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరిగే ప్రతిసారీ లక్ష్మణ్‌ను ఔట్ చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా ఆస్ట్రేలియా బౌలర్లు భావిస్తారంటే అతిశయోక్తి కాదు.
మరికొద్దిరోజుల్లో భారత్‌లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో మరోసారి లక్ష్మణ్ తన ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే 96 టెస్టులు పూర్తి చేసుకున్న లక్ష్మణ్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లోనే వందో టెస్టుకు దగ్గర కానుండడం గమనార్హం. ఇప్పటివరకు 96 టెస్టులు పూర్తి చేసుకున్న లక్ష్మణ్ ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌తో తన వందో టెస్ట్ పూర్తి చేసుకోనున్నాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన లక్ష్మణ్ ఇప్పటివరకు 96 టెస్టులు పూర్తి చేసుకుని సరిగ్గా 6000 పరుగులు సాధించడం విశేషం. ఇందులో 12 సెంచరీలతో పాటు 35 సెంచరీలు సైతం లక్ష్మణ్ ఖాతాలో ఉన్నాయి. గతంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భగా 281 పరుగులు సాధించి కంగారులను కంగారెత్తించిన లక్ష్మణ్ ప్రస్తుత సిరీస్‌లో సైతం కంగారు వేగానికి చెక్ పెట్టాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తాను ఎప్పుడూ ఆధిక్యం ప్రదర్శించే ఆస్ట్రేలియా జట్టు, స్వదేశంలో టోర్నీ ఇలా అన్నీ కలిసి వచ్చే అంశాలతో నిండిన ఈ టోర్నీలో లక్ష్మణ్ తన పూర్వపు ఫామ్‌ను కనబరుస్తాడా లేదా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.