మెట్టు మెట్టుగా 12వేల పరుగులు..

శుక్రవారం, 17 అక్టోబరు 2008 (17:35 IST)
ఎట్టకేలకు ఆధునిక క్రికెట్ దేవుడు తన జీవితంలోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఒకటా... రెండా... మూడా... 12 వేల పరుగులు... సాధారణ క్రికెటర్ తన జీవితకాలంలో కలలో కూడా ఊహించలేని పరుగులు... క్రికెట్ ప్రపంచంలో బ్రియన్‌లారా రికార్డును అధిగమించి సమకాలీన క్రికెట్‌లో సింహనాదం చేసిన జగజ్జేత సాధించిన నిరుపమాన పరుగులు.... సచిన్ టెండూల్కర్‌కే సాధ్యమైన పరుగులు...

మొహాలీలో శుక్రవారం భారత్-ఆసీస్ మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మూడు అరుదైన రికార్డులను సాధించింది. 1. బ్రియన్ లారా టెస్ట్ క్రికెట్‌లో సాధించిన 11953 పరుగుల రికార్డును సచిన్ బద్దలు గొట్టాడు. 2. టీ విరామం తర్వాత 12000 పరుగులు సాధించిన ఒకే ఒక్కడిగా, మొట్టమొదటి క్రికెటర్‌గా సచిన్ చరిత్రపుటల్లో నిలిచాడు. 3. టెస్టుక్రికెట్‌లో 7000 పరుగులు సాధించిన 4వ భారతీయుడిగా సౌరవ్ గంగూలీ రికార్డు సృష్టించాడు.

ఎలా సాధ్యమైంది.. సచిన్ టెండూల్కర్ కాదు సచిన్ ట్వల్‌'డూల్కర్' లేదా తెలుగులో చెప్పాలంటే సచిన్ పన్నెండూల్కర్‌గా చెప్పుకోదగిన ఈ అద్భుత ఫీట్... ఎలా సాధ్యమైంది... మానవ విజయాల చరిత్రలో అరుదుగా సంభవించే ఈ అసాధారణ ఫీట్‌ను ఎలా సాధించాడీ భారతీయ బుడతడు?

ఈ లెక్కలు.. ఈ వర్ణనలు.. రికార్డుల నమోదులు... రేపటినుంచి క్రికెట్ చరిత్ర పుస్తకాలలో చదువుకుందాం కానీ.. ముందుగా ఒక్కో ఇటుకను పేర్చి ఇల్లు కట్టినట్లుగా.. ఒక్కో పరుగును రికార్డు పుటలకు చేరుస్తూ సచిన్ సాధించిన ఈ అద్భుత విజయానికి పునాదిగా నిలిచిన మైలురాళ్లను ప్రస్తుతం గుర్తు చేసుకుందాం...

ఆగస్టు నెలలో శ్రీలంక టూర్‌ నుంచి అత్యధిక పరుగుల రికార్డుపై కన్నేసిన సచిన్ చివరకు తన 152వ టెస్టులో, 274వ ఇన్నింగ్స్‌లో తనకే సాధ్యమైన మైలురాయిని అధిగమించాడు. ఈ సందర్భంగా ఈ భారతీయ లిటిల్ మాస్టర్ లేదా బ్లాస్టర్ సాధించిన ప్రతి వెయ్యిపరుగుల చరిత్రను స్మరించుకుందాం..

1000 పరుగులు - 19వ మ్యాచ్, 29వ ఇన్నింగ్, దక్షిణాఫ్రికాతో, 1992

2000 పరుగులు - 32వ మ్యాచ్, 45వ ఇన్నింగ్, న్యూజీలాండ్, 1994

3000 పరుగులు - 45వ మ్యాచ్, 68వ ఇన్నిగ్, దక్షిణాఫ్రికా, 1996

4000 పరుగులు - 58వ మ్యాచ్, 87వ ఇన్నింగ్, శ్రీలంక 1997

5000 పరుగులు 67వ మ్యాచ్, 103వ ఇన్నింగ్, పాకిస్తాన్, 1999

6000 పరుగులు 76వ మ్యాచ్, 121వ ఇన్నింగ్, దక్షిణాఫ్రికా, 2000

7000 పరుగులు 85వ మ్యాచ్, 137వ ఇన్నింగ్, దక్షిణాఫ్రికా, 2001

8000 పరుగులు 96వ మ్యాచ్, 154వ ఇన్నింగ్, వెస్టిండీస్, 2002

9000 పరుగులు 111వ మ్యాచ్, 180వ ఇన్నింగ్, ఆస్ట్రేలియా, 2004

10000 పరుగులు 122వ మ్యాచ్, 196వ ఇన్నింగ్, పాకిస్తాన్, 2005

11000 పరుగులు 139వ మ్యాచ్, 224వ ఇన్నింగ్ ఇంగ్లండ్, 2007

12000 పరుగులు 152వ మ్యాచ్ 247వ ఇన్నింగ్, ఆస్ట్రేలియా, 2008

వెబ్దునియా పై చదవండి