వెస్టిండీస్ క్రికెట్ సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన అసమాన క్రికెటర్లలో క్లైవ్ లాయిడ్ ఒకరు. 1944, ఆగస్ట్ 31న గుయానాలోని జార్జ్‌టౌన్‌లో జన్మించిన క్లైవ్ హుబెర్ట్ లాయిడ్ 1974 నుంచి 1985 వరకు వెస్టీండీస్ కెప్టెన్‌గా ఉన్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథుల్లో క్లైవ్ లాయిడ్ పేరు ఎప్పటికీ చెరపలేనిది.
వెస్టిండీస్‌కు తొలి రెండు ప్రపంచకప్‌లను అందించడంతోపాటు, ఆయన సారథ్య మహత్యంతో సుమారు రెండు దశాబ్దాలపాటు ఆ దేశ జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసించింది. ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఆయనకు ఖ్యాతి లభించింది. క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో ఒక దశలో వెస్టీండీస్ వరుసగా 27 టెస్టులలో పరాజయం పొందలేదు.
వీటిలో 11 విజయాలున్నాయి. (ఈ కాలంలో ఒక టెస్టుకు మాత్రం వివియన్ రిచర్డ్స్ నాయకత్వం వహించారు). లాయిడ్ నేతృత్వంలో వెస్టిండీస్ జట్టు మూడు ప్రపంచకప్‌లు ఆడింది. టెస్ట్ క్రికెట్లోనూ క్లైవ్ లాయిడ్ అసమాన కెప్టెన్. ఒకప్పుడు లాయిడ్ సేనను ఎదుర్కొనేందుకు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా వెలుగొందుతున్న జట్లు జంకేవంటే అతిశయోక్తి కాదు.
వన్డే క్రికెట్లో లాయిడ్ రికార్డును పరిశీలిస్తే.. తొలి రెండు ప్రపంచకప్‌లను (1975, 1979 ప్రపంచకప్‌లు) క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు కైవసం చేసుకోగా, 1983 ప్రపంచకప్ ఫైనల్స్‌లో మాత్రం ఓడిపోయింది. 1983 ఫైనల్స్‌లో క్లైవ్ బృందాన్ని భారత జట్టు మట్టికరిపించింది.
లాయిడ్ టెస్ట్ క్రికెట్లో 110 మ్యాచ్‌లు ఆడి 46.67 సగటుతో 7515 పరుగులు సాధించారు. అతని తొలి టెస్ట్ 1966లో ఆడారు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోరు 242 నాటౌట్. టెస్ట్ క్రికెట్లో 19 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు సాధించారు. వన్డే క్రికెట్లో లాయిడ్ 87 మ్యాచ్‌లు ఆడి 39.53 సగటుతో 1977 పరుగులు సాధించారు.
ఇందులో ఒక సెంచరీ, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలో అత్యధిక స్కోరు 102 పరుగులు. 1971లో లాయిడ్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా లాయిడ్ క్రికెట్‌తో అనుబంధాన్ని వదులుకోలేదు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత లాయిడ్ కోచ్‌గా, కామంటేటర్గానూ క్రికెట్‌కు సేవలు అందిస్తున్నారు. ఆయను బిగ్ సి, హుబర్ట్ అని కూడా పిలుస్తారు.