భారత క్రికెట్ జట్టుకు కొత్త హిట్ మ్యాన్ దొరికాడా...? టీమిండియాలో హిట్ మ్యాన్‌గా గుర్తింపుపొందిన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తిపలికాడు. దీంతో రోహిత్ లేని లోటును భర్తీ చేసే ఆటగాడు ఎవరబ్బా అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో అభిషేక్ శర్మ రూపంలో సరికొత్త హిట్ మ్యాన్ లభించాడు..
కేవలం 24 ఏళ్ల ఈ ఆటగాడు ఇంగ్లండ్ జట్టులోనూ భీభత్సం సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోల్‌కతా వేదికగా బుధవారం రాత్రి జరిగిన భారత్ - ఇంగ్లండ్ టీ20 మ్యాచ్‌లో ఈ కుర్రోడు తన బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని మోతగించాడు.
కానీ, అతను స్కోరు 26 వద్ద అవుట్ అయ్యాడు, ఆ తర్వాతి బంతికి సూర్య కూడా తన వికెట్ కోల్పోయాడు. దీని తర్వాత 24 ఏళ్ల అభిషేక్ బాధ్యతలు స్వీకరించి ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి 34 బంతుల్లో 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉండటం గమనార్హం.
అభిషేక్ శర్మ జూలై 2024లో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. అరంగేట్రం సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీ సాధించాడు. అయితే, దీని తర్వాత అతని ప్రదర్శన నిలకడలేకుండా పోయింది. అయితే తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ దుమ్మురేపాడు. పైగా, ఇంగ్లండ్ జట్టుపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ చరిత్రసృష్టించాడు.