భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి కుంబ్లే అర్ధంతరంగా తప్పుకున్నాడు. తన అనుభవంతో.. గురువుగా భారత క్రికెట్‌కు మార్గనిర్దేశం చేయాలని ఆశించిన కుంబ్లే ఆ పనిని మధ్యలోనే ఆపేశాడు. ఆటగాడిగా జేజేలు అందుకున్న జంబో కోచ్‌గానూ మెరుగైన ఫలితాలతో అందరి అభిమానం చూరగొన్నా.. క్రికెటర్లకు మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయాడు..!
తాజాగా బయటికొచ్చిన విషయం సంచలనం రేపుతున్నది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రెండు రోజుల ముందు టీమ్ సమావేశంలో కోచ్ కుంబ్లేపై కోహ్లీ నోరు పారేసుకున్నాడట. అందుకే కుంబ్లే ఇంత సడెన్‌గా రాజీనామా నిర్ణయం తీసుకున్నాడని, వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగాలన్నా వినలేదని టీమ్‌లోని వర్గాలు వెల్లడించాయి. ఫైనల్‌కు ముందు ఎప్పటిలాగే టీమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కుంబ్లేతో విరాట్ వాగ్వాదానికి దిగడమే కాదు అతన్ని తిట్టినట్లు సమాచారం. అంతేకాదు టీమ్‌లో ఎవరూ నువ్వు కోచ్‌గా కొనసాగాలని అనుకోవడం లేదని విరాట్ అన్నట్లు తెలిసింది. అయితే కుంబ్లే మాత్రం జరిగిందేదో జరిగింది అని గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. అయినా కోహ్లీ వినకపోవడంతో కుంబ్లే మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కోచ్ పదవి నుంచి తప్పుకోవడమే మంచిదని భావించి.. విండీస్ టూర్ వరకు కొనసాగాలన్నా రాజీనామా చేశాడు.